దిశ, వెబ్‌డెస్క్ : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి తరలివెళ్లే భక్తులు కఠిన నియమ నిష్ఠలతో దీక్షను కొనసాగించడంతో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కేరళ హైకోర్టు సూచించింది. ముఖ్యంగా యాత్రలో అత్యంత పవిత్రంగా భావించే పంబా నదిని కలుషితం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపై ఉందని స్పష్టం చేసింది. నదిలో దుస్తులు, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను పడేయకుండా యాత్రికులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)ను ఆదేశించింది.
శబరిమల ప్రత్యేక కమిషనర్ సమర్పించిన నెలవారీ నివేదికను పరిశీలించిన జస్టిస్ వి. రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పంబా నదిలో భక్తులు వదిలేస్తున్న దుస్తులు, చెత్త వల్ల నది కలుషితమవుతోందని కమిషనర్ తన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు.. శబరిమల మార్గంలో యాత్రికులను తరలించే అన్ని బస్సుల్లో స్పీకర్లు ఏర్పాటు చేయాలని కేఎస్‌ఆర్‌టీసీకి స్పష్టం చేసింది. భక్తులు బస్సులు ఎక్కే ప్రాంగణాల్లోనూ ముందుగా రికార్డు చేసిన అవగాహన సందేశాలను వినిపించాలని తెలిపింది.
వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో.. పలు భాషల్లో రూపొందించిన ఆడియో సందేశాలను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) సిద్ధం చేసి, వాటిని కేఎస్‌ఆర్‌టీసీకి అందజేయాలని ధర్మాసనం నిర్దేశించింది. యాత్రలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నివారించాలని, సింథటిక్ కుంకుమతో పాటు భూమిలో త్వరగా కలిసిపోని రసాయన వస్తువులను వాడవద్దని ఈ సందేశాల ద్వారా భక్తులకు వివరించనున్నారు.
మరోవైపు, ఎరుమేలి గ్రామ పంచాయతీ దాఖలు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. అక్కడి వాహనాల పార్కింగ్ ప్రాంగణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని ఆదేశించింది. పార్కింగ్ ప్రాంతంలోని మరుగుదొడ్లు, స్నానపు గదుల పరిసరాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తక్షణమే తొలగించాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుకు స్పష్టం చేసింది. అలాగే వాహనాల పార్కింగ్ సమయ పరిమితిని సూచిస్తూ స్పష్టమైన బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొంది. శబరిమల యాత్ర కేవలం ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదని, పర్యావరణం పట్ల బాధ్యతను చాటుకునే వేదిక అని కోర్టు అభిప్రాయపడింది. పంబా నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా, ఈ పుణ్యక్షేత్ర సహజ సౌందర్యాన్ని భావితరాలకు అందించాలని సూచించింది.