దిశ, వెబ్‌డెస్క్: జేపీ మోర్గాన్ చేజ్, వీసా, మాస్టర్‌కార్డ్‌లకు సేవలందించే థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై జరిగిన సైబర్ దాడుల్లో వేలాది మంది కస్టమర్ల మార్కెటింగ్ సమాచారం లీక్ అవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ఆ మూడు సంస్థల పేమెంట్ వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయని, కార్డ్ పేమెంట్ వివరాలు మాత్రం బహిర్గతం కాలేదని ఆయా సంస్థలు స్పష్టం చేశాయి. అమెరికాలోని అతిపెద్ద బ్యాంకు అయిన జేపీ మోర్గాన్‌కు సేవలందించే బాహ్య సంస్థలపై దాడి జరిగినట్లుగా ఇవాళ తెల్లవారుజమున వెల్లడైంది. దీంతో కస్టమర్ల పేర్లు, ఈమెయిల్ చిరునామాలు, కొన్ని సందర్భాల్లో ఫోన్ నంబర్లు, పోస్టల్ కోడ్లు వంటి మార్కెటింగ్ డేటా లీక్ అయినట్లుగా భావిస్తున్నారు. ‘n0n’ అనే సైబర్ దోపిడీ ముఠా పోస్ట్ చేసిన డేటాను పరిశీలించగా 16 వేల కంటే ఎక్కువ కస్టమర్ ఈమెయిల్ ఐడీలు, 124 బ్యాంకు ఉద్యోగుల ఈమెయిల్ అడ్రస్‌లు ఉన్నట్లుగా తెలుస్తోంది.
అదేవిధంగా ‘వీసా’ కార్డుకు సంబంధించి ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌కు సంబంధించిన ఘటనతో ఈ లీక్‌లకు సంబంధం ఉందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ‘వీసా’ సొంత వ్యవస్థలు ప్రభావితం కాలేదని, కార్డ్ నంబర్లు వంటి పేమెంట్ డేటా సురక్షితంగా ఉందని సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు ఒక నిర్దిష్ట బెనిఫిట్ ప్రోగ్రామ్‌లో చేరిన కొంతమంది కార్డ్హోల్డర్లకు సంబంధించిన పరిమిత సమాచారం మాత్రమే బహిర్గతమైందని మాస్టర్‌కార్డ్ పేర్కొంది. ఈ సమస్యను అదుపులోకి తెచ్చామని, తమ పేమెంట్ నెట్వర్క్ లేదా కార్డ్ సేవలపై ఎలాంటి ప్రభావం లేదని తెలిపింది.
కాగా, నవంబర్ 16న ‘n0n’ అనే సైబర్ ఎక్స్టార్షన్ గ్రూప్ ఈ ఆర్థిక సంస్థల కార్డ్‌హోల్డర్ మార్కెటింగ్ రికార్డులను పొందినట్లుగా ప్రకటించి, ఆ తర్వాత ఫైళ్లను ఆన్లైన్లో విడుదల చేసింది. అయితే, లీక్ అయిన ఫైళ్ల ప్రామాణికతను స్వతంత్రంగా ధృవీకరించాల్సి ఉంది, అలాగే హ్యాక్ అయిన థర్డ్-పార్టీ సంస్థల పేర్లను కంపెనీలు మాత్రం బయట పెట్టలేదు.