దిశ, వెబ్‌డెస్క్: కోళ్లను ప్రాణాంతక బర్డ్ ఫ్లూ (హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా - HPAI) బారి నుండి రక్షించేందుకు దేశంలోనే తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన H5N1 వ్యాక్సిన్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ టీకాను జాతికి అంకితం చేశారు. ఈ వ్యాక్సిన్ అభివృద్ధి భారతదేశ ఆత్మనిర్భరతకు నిదర్శనమని, మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి ఇదొక గర్వకారణమని చౌహాన్ ప్రశంసించారు.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల వివరాల ప్రకారం, భోపాల్‌లోని 'ఐసీఏఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్' (ICAR-NIHSAD) శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజాకు కారణమయ్యే 'క్లేడ్ 2.3.2.1a' (Clade 2.3.2.1a) రకానికి చెందిన H5N1 వైరస్‌ను ఎదుర్కోవడానికి దేశంలో రూపొందించిన మొట్టమొదటి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం.
పౌల్ట్రీ రంగానికి ఎంతో మేలుసాధారణంగా బర్డ్ ఫ్లూగా పిలువబడే HPAI వ్యాధి కోళ్లు, ఇతర పక్షులకు సోకే అత్యంత తీవ్రమైన వైరల్ వ్యాధి. ఈ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు, వ్యాధి సోకిన పక్షులలో మరణాల రేటు దాదాపు 100 శాతం వరకు ఉంటుంది. దీనివల్ల పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ స్వదేశీ టీకా అందుబాటులోకి రావడంతో కోళ్ల పరిశ్రమకు పెద్ద ఎత్తున రక్షణ లభించనుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ క్రీడలు, యువజన సంక్షేమం, సహకార శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్, భోపాల్ బీజేపీ ఎంపీ అలోక్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.