షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 21 నవం 2026, 2:58 సా.
క్రైమ్

అంతర్జాతీయ డ్రగ్‌ కింగ్‌పిన్‌ పట్టివేత!

Truth into the light
ప్రచురణ తేదీ: 21 నవం 2026, 2:58 సా. రచన: One News Desk
9 వీక్షణలు 0 వ్యాఖ్యలు
  • ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ డాన్‌ అరెస్ట్‌..
  • అమెరికా–మెక్సికో జాయింట్‌ ఆపరేషన్‌!
  • దశాబ్దానికి పైగా పోలీసులకు చిక్కకుండా..

మెక్సికో, ఆంధ్రప్రభ :

అంతర్జాతీయ డ్రగ్‌ మాఫియాలో కీలక నేతగా పేరొందిన ఎల్‌ చాపో ఇసిద్రో పట్టుబడ్డాడు. ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న డ్రగ్‌ కింగ్‌పిన్‌ ఫౌస్టో ఇసిద్రో మెజా ఫ్లోరెస్‌ అలియాస్‌ ‘ఎల్‌ చాపో ఇసిద్రో’ను అమెరికా, మెక్సికో భద్రతా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు మెక్సికో రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ ఆపరేషన్‌లో మెక్సికో సైన్యం, నేషనల్‌ గార్డ్‌ ప్రత్యేక దళాలతోపాటు అమెరికా నిఘా సంస్థలు పాల్గొన్నాయి. ఎల్‌ చాపో ఇసిద్రోతోపాటు అతడి డ్రగ్‌ మాఫియా నెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరించే జర్మన్‌ ఎన్‌ అలియాస్‌ ‘సెరాఫిన్‌’, ముఠా ఆర్థిక వ్యవహారాలు చూసుకునే జోస్‌ ఎన్‌ కూడా పట్టుబడ్డారు. ఈ ముగ్గురినీ అమెరికాకు అప్పగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు మెక్సికో రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాల్పులతో దద్దరిల్లిన గ్వాసావే..

సినలోవా రాష్ట్రంలోని గ్వాసావే నగరంలో శుక్రవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫెడరల్‌ భద్రతా బలగాలపై డ్రగ్‌ ముఠా సభ్యులు దాడికి దిగడంతో ఈ ఆపరేషన్‌ ప్రారంభమైనట్లు సమాచారం. ప్రతిగా భద్రతా బలగాలు హెలికాప్టర్ల నుంచి కాల్పులు జరిపాయి. జనావాసాల మధ్య జరిగిన ఈ కాల్పులతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో రహదారులపై ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు సినలోవా తాత్కాలిక గవర్నర్‌ గ్రాసియెలా డొమింగ్యూజ్‌ నవా తెలిపారు.

మరోవైపు, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఘర్షణ జరిగిన ప్రాంతాలకు వెళ్లవద్దని, రహదారులపై ప్రయాణాలు మానుకోవాలని సినలోవా ప్రజా భద్రతా విభాగం హెచ్చరించింది. డ్రగ్‌ మాఫియా సభ్యులు పలు రహదారులపై ట్రక్కులకు నిప్పంటించి రాకపోకలను అడ్డుకున్నట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ (ఏపీ) నివేదించింది. ఈ పరిణామాలతో సుమారు మూడు లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు పేర్కొంది.

బేస్‌బాల్‌ మ్యాచ్‌ మధ్యలోనే నిలిపివేత

గ్వాసావేలోని కురోడా పార్క్‌లో అల్గోడోనెరోస్‌ డి గ్వాసావే, వెనాడోస్‌ డి మజాట్లాన్‌ జట్ల మధ్య మెక్సికన్‌ పసిఫిక్‌ లీగ్‌ బేస్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో ఆటను వెంటనే నిలిపివేశారు. మైదానంలో చోటుచేసుకున్న పరిస్థితిని వ్యాఖ్యాతలు జాతీయ భద్రతకు సంబంధించిన ఘటనగా పేర్కొంటూ ప్రసారాన్ని నిలిపివేశారు. అనంతరం లీగ్‌ అధికారులు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేశారు.

దశాబ్దానికి పైగా తప్పించుకుని..

డ్రగ్‌ మాఫియా డాన్‌ ఫౌస్టో ఇసిద్రో మెజా ఫ్లోరెస్‌ కోసం అమెరికా అధికారులు దశాబ్దానికి పైగా వేట సాగించారు. డ్రగ్‌ మాఫియా డాన్‌ ఫౌస్టో ఇసిద్రో మెజా ఫ్లోరెస్‌ ఆచూకీ కోసం అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) ఐదు మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.44 కోట్లకు పైగా) బహుమతిని ప్రకటించింది. 2005 నుంచి ఇప్పటివరకు అమెరికాలోకి కొకైన్‌, మెథాంఫెటమైన్‌, హెరాయిన్‌, గంజాయి అక్రమంగా రవాణా చేసినట్లు ఫ్లోరెస్‌పై కేసులున్నాయి. అతడి నేతృత్వంలోని డ్రగ్‌ కార్టెల్‌ అనేక మంది పోలీసు అధికారులు, ప్రత్యర్థి ముఠాల సభ్యుల హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

అమెరికాలో కేసులు.. అప్పగింతకు సన్నాహాలు

ఫ్లోరెస్‌పై అమెరికాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. 2012 మేలో వాషింగ్టన్‌ డీసీలోని గ్రాండ్‌ జ్యూరీ అతడిపై నేరారోపణలు నమోదు చేయగా, 2019 నవంబరులో ఫెడరల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. తాజాగా పట్టుబడిన అతడిని మెక్సికో నగరానికి తరలించనున్నట్లు టీవీ అజ్టెకా వెల్లడించింది. అక్కడి నుంచి అమెరికాకు అప్పగించే ప్రక్రియ చేపట్టనున్నారు.

#క్రైమ్
ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ డాన్‌ అరెస్ట్‌.. అమెరికా–మెక్సికో జాయింట్‌ ఆపరేషన్‌! దశాబ్దానికి పైగా పోలీసులకు చిక్కకుండా.. మెక్సికో, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ డ్రగ్‌ మాఫియాలో కీలక నేతగా పేరొందిన…