షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 21 నవం 2026, 9:24 ఉద.
క్రైమ్ వార్తలు

Nalgonda Youth Dies in US Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ యువకుడు మృతి

Truth into the light
ప్రచురణ తేదీ: 21 నవం 2026, 9:24 ఉద. రచన: One News Desk
10 వీక్షణలు 0 వ్యాఖ్యలు

న్యూయార్క్‌, ఆంధ్రప్రభ: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నల్గొండ జిల్లాకు చెందిన ఈరమళ్ల సాయి తేజ (25) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. చదువు పూర్తిచేసుకొని ఉద్యోగం సాధించిన వారం రోజులకే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. న్యూయార్క్‌లోని యుటికా ప్రాంతంలో నివసిస్తున్న సాయి తేజ నవంబర్‌ 18న జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు.

న్యూయార్క్‌ రాష్ట్ర పోలీసుల వివరాల ప్రకారం.. నవంబర్‌ 18న సాయంత్రం 6.34 గంటల సమయంలో కెనజోహరీ సమీపంలోని ఇంటర్‌స్టేట్‌-90 తూర్పు దిశ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. సాయి తేజ కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఓ జింక రహదారిపైకి వచ్చింది. దీంతో అతని కారు జింకను ఢీకొట్టి రోడ్డుపై నిలిచిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ కార్గో వ్యాన్‌ నిలిచిపోయిన కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో మరో రెండు వాహనాలు కూడా ప్రమాదానికి గురయ్యాయి.

ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం

ప్రమాదంలో సాయి తేజ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని సెయింట్‌ మేరీస్‌ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హెలికాప్టర్‌ ద్వారా అల్బానీ మెడికల్‌ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కార్గో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. అతని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఉద్యోగం వచ్చిన వారానికే విషాదం

సాయి తేజ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ చదువు పూర్తిచేసుకొని వారం రోజుల క్రితమే ఉద్యోగం సంపాదించాడు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో నల్గొండలోని అతని కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు ఈరమళ్ల ప్రసాద్‌, శ్రీకన్యకు అతడే కుమారుడు. కుమారుడి మృతితో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సాయి తేజ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం భారత్‌కు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు, సంబంధిత వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ప్రమాదానికి గల పూర్తి కారణాలపై న్యూయార్క్‌ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో పాల్గొన్న ఇతర వాహనాలు, గాయపడిన వారి వివరాలను కూడా పరిశీలిస్తున్నారు.

#క్రైమ్వార్తలు #అంతర్జాతీయం #నల్గొండ
న్యూయార్క్‌, ఆంధ్రప్రభ: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నల్గొండ జిల్లాకు చెందిన ఈరమళ్ల సాయి తేజ…