దిశ, వెబ్‌డెస్క్ : పసిడి ప్రియులకు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మార్కెట్ నుంచి వరుస శుభవార్తలు అందుతున్నాయి. గత వారం రోజులుగా కొనసాగుతున్న బంగారం ధరల పతనం శనివారం కూడా కొనసాగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శనివారం నాడు బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.490 మేర తగ్గి రూ.1,25,080 వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 తగ్గి రూ.1,14,650 వద్ద ట్రేడ్ అవుతోంది.
మరోవైపు వెండి ధర కూడా గత పది రోజుల్లో ఏకంగా రూ.25,000 మేర భారీగా తగ్గింది. అయితే శనివారం నాడు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,75,000 వద్ద నిలకడగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరల పతనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే ఒరవడి కొనసాగితే, త్వరలోనే 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల దిగువకు చేరే అవకాశాలు ఉన్నాయని వారు అంచనా వేస్తున్నారు. దీంతో బంగారం కొనాలనుకునే వారు ధరల కదలికలను ఆసక్తిగా గమనిస్తున్నారు.