దిశ, డైనమిక్ బ్యూరో: జాతరలో సరదాగా తిన్న ఫాస్ట్ ఫుడ్ దాదాపు 100 మందికిపైగా చిన్నారులను ఆసుపత్రి పాలు చేసింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఒక గ్రామ జాతరలో 'చౌమీన్' (నూడుల్స్) తిన్న 100 మందికి పైగా చిన్నారులు, 12 మంది పెద్దలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు ఆదివారం వెల్లడించారు.
శనివారం సాయంత్రం కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిరి గ్రామంలో జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చౌమిన్ తిన్నారు. ఆహారం తిన్న కొద్దిసేపటికే చిన్నారులు, పెద్దలు తీవ్ర కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులను వెంటనే కిర్నాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. తొలుత 118 మంది చిన్నారులను ఆస్పత్రిలో చేర్చగా.. వారిలో 45 మందిని మెరుగైన చికిత్స కోసం బాలాఘాట్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన 73 మందికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. ఇదిలా ఉండగా, అస్వస్థతకు గురైన 12 మంది పెద్దలను కూడా బాలాఘాట్ జిల్లా ఆస్పత్రిలో చేర్చారు.