దిశ, వెబ్ డెస్క్: అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన అగ్నివీర్లకు (Agniveers) కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇటీవల పొడిగించిన రెండేళ్ల సర్వీస్ సమయంలో అగ్నివీర్లు వివాహం చేసుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం అగ్నివీర్లు తమ తొలి నాలుగేళ్ల (First four years) సర్వీసు కాలంలో వివాహం చేసుకోవడానికి వీలు లేదు. అయితే, ఇటీవల పొడిగించిన రెండేళ్ల సర్వీస్ సమయంలో పెళ్లి చేసుకునేందుకు కేంద్రం తాజాగా అనుమతి మంజూరు చేసింది.
మహిళా అగ్నివీర్లకు మెటర్నిటీ సెలవులు, ప్రయోజనాలు
తాజాగా పొడిగించిన సర్వీసు కాలంలో వివాహం చేసుకున్న మహిళా అగ్నివీర్లు గర్భం దాల్చితే వారికి నిబంధనల ప్రకారం మెటర్నిటీ బెనిఫిట్స్ (ప్రసూతి ప్రయోజనాలు), సెలవులు లభించనున్నాయి. అగ్నిపథ్ పథకంలో భాగంగా తొలి నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత 25 శాతం మందిని రెగ్యులర్ సర్వీసులోకి తీసుకుంటుండగా, మిగతా 75 శాతం మందికి అదనంగా మరో రెండేళ్ల పాటు పనిచేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కల్పించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో వేలాది మంది అగ్నివీర్లు లబ్ధి పొందనున్నారు.