షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 22 నవం 2026, 1:17 సా.
క్రైమ్ వార్తలు

మల్కాజిగిరిలో 60 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్‌!

Truth into the light
ప్రచురణ తేదీ: 22 నవం 2026, 1:17 సా. రచన: One News Desk
9 వీక్షణలు 0 వ్యాఖ్యలు
  • రూ.30 లక్షలు విలువైన సరుకు స్వాధీనం
  • అంతర్రాష్ట్ర రవాణా ముఠాతో సంబంధాలు?
  • పరారీలో మరో ఇద్దరు నిందితులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :

మల్కాజిగిరి పోలీసులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 30 లక్షల విలువైన 60.380 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని పోలీసులు తెలిపారు.

అరెస్టయిన వారిని ముంబైలోని జోగేశ్వరి ఈస్ట్‌కు చెందిన డ్రైవర్‌ సమీర్‌ హసన్‌ అలీ షేక్‌ అలియాస్‌ రవికుమార్‌ చౌదరి (42), హైదరాబాద్‌ కింగ్‌కోఠికి చెందిన వంటమనిషి మహమ్మద్‌ ఖాన్‌ (52), కూకట్‌పల్లికి చెందిన డ్రైవర్‌ చందన్‌ కుమార్‌ జెనా (31)గా గుర్తించారు. పరారీలో ఉన్నవారిని రాహుల్‌ అలియాస్‌ కృష్ణ, అజయ్‌ సాగర్‌గా పేర్కొన్నారు.

మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి.సుమతి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అందిన పక్కా సమాచారంతో నాచారం పోలీసులు, ప్రత్యేక ఆపరేషన్స్‌ బృందం కలిసి ఐడీఏ నాచారం వద్ద ఓ కారును అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా డిక్కీలో నాలుగు ప్లాస్టిక్‌ గోనె సంచులు కనిపించాయి. వాటిలో 60 ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి.. వాటిని పరిశీలించగా సుమారు 60.380 కిలోల ఎండు గంజాయి ఉన్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.

రాహుల్‌ అంతర్రాష్ట్ర గంజాయి రవాణా నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇజాజ్‌ అనే వ్యక్తి ద్వారా సమీర్‌కు పరిచయమైన రాహుల్‌.. ఒడిశా నుంచి కిలో గంజాయిని సుమారు రూ.2 వేల చొప్పున కొనుగోలు చేసి, హైదరాబాద్‌, ముంబైలకు తరలించి అధిక ధరకు విక్రయించేలా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ రవాణా కోసం సమీర్‌, మహమ్మద్‌ ఖాన్‌, చందన్‌ కుమార్‌ జెనాలను రాహుల్‌ నియమించుకున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు చెల్లిస్తానని హామీ ఇచ్చినట్లు వివరించారు. గతవారం ఈ ముగ్గురూ ఒడిశాకు వెళ్లి గంజాయి సరుకును తీసుకొచ్చారని, ఐడీఏ నాచారం వద్ద మరో వ్యక్తికి అందజేసేందుకు చేరుకున్న సమయంలో పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న రాహుల్‌, అజయ్‌ సాగర్‌ల కోసం గాలింపు కొనసాగుతోంది.

#క్రైమ్వార్తలు
రూ.30 లక్షలు విలువైన సరుకు స్వాధీనం అంతర్రాష్ట్ర రవాణా ముఠాతో సంబంధాలు? పరారీలో మరో ఇద్దరు నిందితులు హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మల్కాజిగిరి పోలీసులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న…