దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో రూ. 50 లక్షల ఆర్థిక వివాదం కారణంగా సొంత తండ్రిని, సోదరిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ జంట హత్యల కేసులో 26 ఏళ్ల ప్రధాన నిందితుడు హర్ష్ యాదవ్ (Harsh Yadav) పరారీలో ఉండగా, అతనికి సహకరించిన ఒక మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుల పంపకం విషయంలో తలెత్తిన విభేదాలతోనే హర్ష్ యాదవ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
నవంబర్ 19వ తేదీన ఇండోర్‌లోని వారి నివాసంలో హర్ష్ సోదరి హర్షిత యాదవ్ (Harshita Yadav) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె నోటికి స్కార్ఫ్ చుట్టి ఉండటంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలించగా, హర్ష్ ఒక బాలుడితో కలిసి వెళ్తున్న దృశ్యాలు కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంతలోనే ఆటో డ్రైవర్ అయిన అతని తండ్రి రాజు యాదవ్ (Raju Yadav) మృతదేహం సమీప పట్టణంలో లభ్యమవడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
మృతుడు రాజు యాదవ్ ఇటీవలే ఇండోర్‌లోని తన ఇంటిని సుమారు రూ. 50 లక్షలకు విక్రయించినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆ డబ్బులో రూ. 25 లక్షలను తన కుమార్తె హర్షితకు ఇవ్వగా, మిగిలిన రూ. 25 లక్షల విషయంలో తండ్రి రాజు యాదవ్ మరియు కుమారుడు హర్ష్ మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ఈ ఆర్థిక వివాదంతో కక్ష పెంచుకున్న హర్ష్ యాదవ్, తన మైనర్ స్నేహితుడితో కలిసి పక్కా పథకం ప్రకారం ముందుగా తండ్రి రాజు యాదవ్‌ను హత్య చేసి మృతదేహాన్ని సమీప పట్టణంలో పడేశాడు. ఆ మరుసటి రోజు ఇంట్లో ఉన్న సోదరి హర్షితను కూడా గొంతు నులిమి హతమార్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న మైనర్ బాలుడిని పోలీసులు విచారిస్తుండగా, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హర్ష్ యాదవ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.