షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 24 నవం 2026, 6:11 సా.
తాజా వార్తలు

తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలగాల్సిందే: కలెక్టర్‌కు మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు

Truth into the light
ప్రచురణ తేదీ: 24 నవం 2026, 6:11 సా. రచన: One News Desk
14 వీక్షణలు 0 వ్యాఖ్యలు
తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలగాల్సిందే: కలెక్టర్‌కు మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఎవరైనా తీవ్రంగా విమర్శించవచ్చు కానీ, వాటి అమలును అడ్డుకునే నిరసనలను మాత్రం సహించబోమని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా జరిగే నిరసన పిలుపులను నిలువరించేందుకే తాము ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లుగా స్పష్టం చేసింది.

ఆదేశాలు పాటించాల్సిందే..

సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసినంత మాత్రాన ఆదేశాలను ధిక్కరించడానికి వీల్లేదని జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ ఎండీ సుమతిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని గుర్తుచేసింది. దీంతో జిల్లా యంత్రాంగం, పోలీసులు, దేవస్థానం అధికారులు నవంబర్ 20 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 144 ప్రకారం సుప్రీంకోర్టుకు సహకరించాల్సిన బాధ్యత మదురై కలెక్టర్‌పై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించాలని ఏ ఇతర అధికారి నుంచైనా సూచనలు వచ్చినా పట్టించుకోవద్దని కలెక్టర్‌కు సూచించింది. కొండపై కార్తీక దీపం వెలిగేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్‌దేనని నొక్కి చెప్పింది.

మత స్వేచ్ఛకు భంగం కలగొద్దు..

కార్తీక దీపం సందర్భంగా కొండపైకి వెళ్లడం, గుమిగూడటంపై మదురై కలెక్టర్ విధించిన నిషేధాజ్ఞలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద జారీ చేసిన నిషేధాజ్ఞలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం లభించే మత స్వేచ్ఛకు ఇబ్బంది కలగకుండా అమలు చేయాలని ఆదేశించింది. అలాగే, నిషేధాజ్ఞల పేరుతో ఎవరినైనా అక్రమంగా నిర్బంధించి ఉంటే వెంటనే విడుదల చేయాలని పోలీసులకు సూచించింది.

కాగా, కార్తీక దీపం వేడుకల నేపథ్యంలో రాతి స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు దేవస్థానం బృందం, అధికారులకు సుప్రీంకోర్టు నవంబర్ 20న ఒక్కసారి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీన్ని భవిష్యత్తులో హక్కుగానో, సంప్రదాయంగానో భావించరాదని స్పష్టం చేస్తూ.. సమీపంలోని దర్గా, మసీదు వద్ద గుమిగూడటం, ఊరేగింపులు, నినాదాలపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో కలెక్టర్ నిషేధాజ్ఞలు జారీ చేయగా, తాజాగా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

#తాజావార్తలు
దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఎవరైనా తీవ్రంగా విమర్శించవచ్చు కానీ, వాటి అమలును అడ్డుకునే నిరసనలను మాత్రం సహించబోమని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక…