షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 24 నవం 2026, 7:57 సా.
క్రైమ్

ట్రాక్టర్ ఢీకొని రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం.. ఇద్దరికి గాయాలు

Truth into the light
ప్రచురణ తేదీ: 24 నవం 2026, 7:57 సా. రచన: One News Desk
17 వీక్షణలు 0 వ్యాఖ్యలు

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి

ఊట్కూర్, ఆంధ్రప్రభ :

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఊర లక్ష్మమ్మ దేవాలయం సమీపంలో మంగళవారం రాత్రి ట్రాక్టర్ రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఊట్కూర్‌లోని ఈశ్వర్ మందిర్ వీధికి చెందిన జంగిడి నరసింహ చెక్‌పోస్టు నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా, కార్గిల్ చౌరస్తాకు చెందిన చామకూర మహేష్ మరో ద్విచక్ర వాహనంపై చెక్‌పోస్టు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని ఎర్గాట్‌పల్లి గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ యజమాని పత్తి విక్రయించి తిరిగి వస్తూ అతివేగంగా వచ్చి ముందు వెళ్తున్న జంగిడి నరసింహ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. అనంతరం ఎదురుగా వస్తున్న చామకూర మహేష్ ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో జంగిడి నరసింహ కాలు విరగడంతో వెంటనే నారాయణపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చామకూర మహేష్ కాలికి గాయాలు కావడంతో ఆయనను కూడా నారాయణపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై ఊట్కూర్ ఎస్సై రమేష్‌ను వివరణ కోరగా, తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ ఎం. రేణుకా భరత్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

ఊట్కూర్ మండల కేంద్రంలోని ఊర లక్ష్మమ్మ దేవాలయం సమీప రహదారిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అతివేగంగా వచ్చే ట్రాక్టర్లు, ఇతర వాహనాల వల్ల రహదారిపై ప్రయాణించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, వాహనాల వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.

#క్రైమ్
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఊర లక్ష్మమ్మ దేవాలయం సమీపంలో మంగళవారం రాత్రి ట్రాక్టర్ రెండు…