షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 25 నవం 2026, 12:11 సా.
ఆంధ్రప్రదేశ్

AP | జ్యోతిష్యుడికి రూ.70 లక్షల టోకరా..!

Truth into the light
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 12:11 సా. రచన: One News Desk
14 వీక్షణలు 0 వ్యాఖ్యలు

AP | జ్యోతిష్యుడికి రూ.70 లక్షల టోకరా..!

17 కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరింపులు..
బెంగళూరు, ఢిల్లీ పోలీసుల పేరుతో భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు..
ఐదు విడతల్లో నగదు బదిలీ..
ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన

AP | గుంటూరు, ఆంధ్రప్రభ : సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పంథాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో అమాయకులను భయభ్రాంతులకు గురిచేస్తూ లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా గుంటూరు నగరంలో ఓ జ్యోతిష్యుడు ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా రూ.70 లక్షలు పోగొట్టుకున్నారు. పోలీసులమంటూ ఫోన్‌ చేసిన నిందితులు.. వివిధ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించి భారీ మొత్తాన్ని కాజేశారు. ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన బాధితుడు తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగరంలోని ఉద్యోగ నగర్‌కు చెందిన జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి జ్యోతిష్యుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆయనకు 2025 సెప్టెంబర్‌ 4న సైబర్‌ నేరగాళ్ల నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. బెంగళూరులో ఆయన పేరుతో ఓ సిమ్‌కార్డు తీసుకున్నారని, ఆ నంబర్‌ నుంచి పోలీసు అధికారి కుమార్తెకు అసభ్యకర సందేశాలు పంపించారని నిందితులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 17 కేసులు నమోదయ్యాయని చెబుతూ ఆయన్ను తీవ్రంగా భయపెట్టారు. డిజిటల్‌ అరెస్ట్‌ తప్పదని హెచ్చరించారు.

ఈ కేసుల విచారణ కోసం తొలుత బెంగళూరుకు, అనంతరం ఢిల్లీకి రావాల్సి ఉంటుందని నిందితులు చెప్పారు. దీంతో రామలింగేశ్వర శాస్త్రి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే అదనుగా భావించిన సైబర్‌ నేరగాళ్లు మరో వ్యవహారాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. సదాఖాన్‌ అనే వ్యక్తికి సంబంధించిన ఆస్తి విక్రయ వ్యవహారంలో కమీషన్‌ తీసుకున్న అంశంపై కూడా కేసు నమోదైనట్లు నమ్మించారు. ఒకటి కాదు.. రెండు కేసుల్లో చిక్కుకున్నానని భావించిన బాధితుడు నిందితుల మాటలను నమ్మారు.

విచారణ నుంచి బయటపడాలంటే ఆర్బీఐ ద్వారా తన బ్యాంకు ఖాతాలను పరిశీలన చేయించుకోవాలని నిందితులు సూచించారు. ఇందుకోసం వివిధ బ్యాంకు ఖాతాల నుంచి తాము సూచించిన ఖాతాలకు నగదు బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు. విచారణ పేరుతో నిందితులు చెప్పిన సూచనలను పాటిస్తే సమస్య నుంచి బయటపడవచ్చని బాధితుడు భావించారు. ఈ క్రమంలో వారు సూచించిన బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపేందుకు అంగీకరించారు.

2025 సెప్టెంబర్‌ 8 నుంచి అక్టోబర్‌ 14 మధ్య ఐదు విడతల్లో మొత్తం రూ.70 లక్షలను బదిలీ చేశారు. యూనియన్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ ఖాతాల నుంచి సైబర్‌ నేరగాళ్లు సూచించిన ఖాతాలకు ఈ మొత్తాన్ని పంపించారు. అయితే నగదు బదిలీ చేసినప్పటికీ తిరిగి డబ్బులు రాకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. నిందితులను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించారు.

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో జరుగుతున్న సైబర్‌ మోసాలపై ఇటీవల అవగాహన పెరుగుతుండటంతో రామలింగేశ్వర శాస్త్రి తాజాగా పోలీసులను ఆశ్రయించారు. పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడి నుంచి పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు.. నగదు ఏయే బ్యాంకు ఖాతాలకు బదిలీ అయింది? నిందితులు ఎక్కడి నుంచి ఫోన్‌ చేశారు? ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు, ప్రభుత్వ అధికారులు, బ్యాంకు ప్రతినిధులమంటూ ఫోన్‌ చేసి బెదిరించడం సైబర్‌ నేరగాళ్లు అనుసరిస్తున్న ప్రధాన మోసపూరిత పద్ధతుల్లో ఒకటి. అరెస్ట్‌ చేస్తామని, కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టి డబ్బులు బదిలీ చేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ వచ్చినప్పుడు భయపడి నగదు పంపకుండా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

#ఆంధ్రప్రదేశ్
AP | జ్యోతిష్యుడికి రూ.70 లక్షల టోకరా..! 17 కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరింపులు..బెంగళూరు, ఢిల్లీ పోలీసుల పేరుతో భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు..ఐదు విడతల్లో నగదు బదిలీ..ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన…