షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 25 నవం 2026, 5:06 సా.
రాజకీయాలు

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ సస్పెండ్ వివాదం.. కాంగ్రెస్ నేతలతో ‘META’ ప్రతినిధుల భేటీ

Truth into the light
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 5:06 సా. రచన: One News Desk
17 వీక్షణలు 0 వ్యాఖ్యలు
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ సస్పెండ్ వివాదం.. కాంగ్రెస్ నేతలతో ‘META’ ప్రతినిధుల భేటీ

దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల సస్పెన్షన్‌, కంటెంట్ నియంత్రణలపై చెలరేగిన వివాదం నేపథ్యంలో మెటా (Meta) పబ్లిక్ పాలసీ బృందం కాంగ్రెస్ నేతలతో సమావేశమైంది. కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ విభాగం చైర్‌పర్సన్ సుప్రియా శ్రీనేత్, ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) నేతలతో మెటా ప్రతినిధులు ఇవాళ చర్చలు జరిపారు. ఈ భేటీలో భాగంగా, తాము భారతదేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని, చట్టపరమైన ఆదేశాలు, కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఆధారంగానే ఖాతాలను సమీక్షిస్తామని ‘మెటా’ ప్రతినిధులు వివరించారు.

AI కంటెంట్‌పై రూల్స్, నిరసనలపై ఆందోళన

అంతేకాకుండా, డీప్‌ఫేక్‌లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ ద్వారా రూపొందించిన, మార్పులు చేసిన టెక్స్ట్, చిత్రాలు, ఆడియో, వీడియోలపై కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని మెటా ప్రతినిధులు స్పష్టం చేశారు. యూజర్ల రిపోర్టింగ్, చట్టబద్ధమైన ప్రభుత్వ, న్యాయస్థాన ఆదేశాలు, ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదే సమయంలో, మెటా కార్యాలయాల వద్ద జరిగిన నిరసనలు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లుగా సమాచారం.

అల్టిమేటం నేపథ్యంలో భేటీ..

కాగా, ఇటీవల యూత్ కాంగ్రెస్ నేతల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఆంక్షలు విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్, ముంబై, గురుగ్రామ్‌లోని మెటా కార్యాలయాల వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ప్రతిపక్ష గొంతు నొక్కేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించగా, నిబంధనలపై స్పష్టతనిచ్చి ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేయాలని వారం రోజుల అల్టిమేటం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ‘మెటా’ ప్రతినిధులు కాంగ్రెస్ నేతలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

#రాజకీయాలు
దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల సస్పెన్షన్‌, కంటెంట్ నియంత్రణలపై చెలరేగిన వివాదం నేపథ్యంలో మెటా (Meta) పబ్లిక్ పాలసీ బృందం కాంగ్రెస్ నేతలతో సమావేశమైంది. కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్…