షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 27 నవం 2026, 12:22 సా.
ఆంధ్రప్రదేశ్

Andhra: స్తంభంపైనే CPR.. లైన్‌మెన్‌కు పునర్జన్మ!

Truth into the light
ప్రచురణ తేదీ: 27 నవం 2026, 12:22 సా. రచన: One News Desk
5 వీక్షణలు 0 వ్యాఖ్యలు
Andhra: స్తంభంపైనే CPR.. లైన్‌మెన్‌కు పునర్జన్మ!

విధి నిర్వహణలో ఉన్న ఓ లైన్మెన్‌కు విద్యుత్ స్తంభంపైనే మృత్యువు ఎదురైంది. మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగలడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్తంభంపైనే తీగల మధ్య వేలాడుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కింద ఉన్నవారంతా ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్న సమయంలో ఓ వ్యక్తి అసాధారణ ధైర్యం ప్రదర్శించాడు. వెంటనే స్తంభం పైకి చేరుకుని.. అక్కడే లైన్మెన్‌కు CPR అందించాడు. అతడి సమయస్ఫూర్తి, సాహసం ఓ నిండు ప్రాణాన్ని కాపాడాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరులో చోటుచేసుకుంది.

కంబదూరులో విద్యుత్ సరఫరాలో తలెత్తిన లోపాలను సరిచేసేందుకు లైన్మెన్ రాజు ఓ విద్యుత్ స్తంభం ఎక్కాడు. మరమ్మతులు చేస్తుండగా అనుకోకుండా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. షాక్ తీవ్రతకు అపస్మారక స్థితిలోకి వెళ్లి స్తంభంపైనే కుప్పకూలిపోయాడు. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. అయితే స్తంభంపై ఉన్న రాజును కిందకు దించేలోపే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని గుర్తించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి సాహసోపేతంగా స్పందించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కరెంట్ ఆఫ్ చేసి.. విద్యుత్ స్తంభం పైకి చేరుకున్నాడు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రాజుకు అక్కడే CPR చేయడం ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత రాజు తేరుకోవవడంతో అందరిలో ఆశలు చిగురించాయి. అనంతరం అతడిని జాగ్రత్తగా కిందకు దించి 108 అంబులెన్స్‌లో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సమయానికి CPR.. ప్రాణాలతో బయటపడిన రాజు

కళ్యాణదుర్గం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజును అనంతపురం ఆస్పత్రికి తరలించారు. కరెంట్ షాక్ కారణంగా గుండె లయలో తీవ్ర సమస్య తలెత్తిందని, సకాలంలో CPR అందించడంతో రాజు ప్రాణాలతో బయటపడగలిగాడని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఏమాత్రం భయపడకుండా సాహసం చేసి, సమయస్ఫూర్తితో CPR అందించిన ఆ వ్యక్తిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నాడని కొనియాడుతున్నారు.

#ఆంధ్రప్రదేశ్
విధి నిర్వహణలో ఉన్న ఓ లైన్మెన్‌కు విద్యుత్ స్తంభంపైనే మృత్యువు ఎదురైంది. మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగలడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్తంభంపైనే తీగల మధ్య…