దిశ, వెబ్ డెస్క్: ధర్మం యొక్క అసలైన అర్థం, అహంకారం, మహానుభావుల కర్తవ్యంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అద్భుతాలు చేస్తేనే మహాత్ములుగా గౌరవించే మానవ నైజాన్ని ప్రస్తావిస్తూ.. సత్యం, కరుణ, విధి నిర్వహణ ప్రాముఖ్యతను ఆయన విశ్లేషించారు. ఈ సందర్భంగా శ్రీరాముడికి, రావణుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ.. రావణుడు అహంకారి కాగా, రాముడు కరుణామయుడని భగవత్ పేర్కొన్నారు. అసలు 'అహంకారం' అంటే ఏమిటని ప్రశ్నిస్తూ.. ‘‘‘నేను’, ‘నాది’ అనే పరిధిని దాటి ఆలోచించలేకపోవడమే అహంకారం’’ అని ఆయన నిర్వచించారు. మనం ఒక నిజమైన సత్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల-మాటల్లో తెలిసినా దానిని అనుభవపూర్వకంగా గ్రహించకపోవడం వల్లే 'నేను, నాది' అనే స్వార్థాన్ని దాటి ముందుకు వెళ్లలేకపోతున్నామని వివరించారు.
అద్భుతాలు చేస్తేనే గౌరవించే ధోరణి
ధర్మం అంటే ఏమిటో మనం మహానుభావుల జీవితాలను పరిశీలించి, వారు చేసిన పనుల ఆధారంగా అంచనా వేస్తుంటామని భగవత్ అన్నారు. సాధారణ మానవ నైజం ఎలా ఉంటుందంటే—ఏదైనా అద్భుతం (Miracle) చూస్తే తప్ప మనం ఎవరికీ గౌరవం ఇవ్వమని, కానీ ఎలాంటి అద్భుతాలు చేయకుండానే ఎందరో మహాత్ములు ఈ లోకంలోకి వచ్చి వెళ్లారని గుర్తు చేశారు. ఒక్కోసారి ఇతరులకు కనిపించే పనులను కర్తవ్య భావంతో (Sense of duty) చేయడం కొందరి విధిగా మారుతుందని, వాటినే సమాజం గుర్తిస్తుందని భగవత్ అన్నారు. వాస్తవానికి ఒక వ్యక్తి ఏం చేస్తాడనేది అతని విధి (Destiny), అతను ఉన్న పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా మోహన్ భగవత్ స్పష్టం చేశారు.