షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 27 నవం 2026, 2:44 సా.
క్రైమ్ వార్తలు

Vadodara Air Force Terror Plot | వడోదర ఎయిర్‌ఫోర్స్‌ కేంద్రంపై దాడికి కుట్ర.. జైషే ఉగ్రవాది అరెస్ట్‌!

Truth into the light
ప్రచురణ తేదీ: 27 నవం 2026, 2:44 సా. రచన: One News Desk
16 వీక్షణలు 0 వ్యాఖ్యలు

వడోదర, ఆంధ్రప్రభ: గుజరాత్‌లో భారీ ఉగ్రవాద కుట్రను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్‌ ) భగ్నం చేసింది. వడోదరలోని భారత వైమానిక దళ (ఎయిర్‌ఫోర్స్‌) కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసింది. అతడికి ఉగ్రవాద సంస్థ జైష్‌-ఎ-మొహమ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. నిందితుడి వద్ద నుంచి ఏకే-47 తరహా రైఫిల్‌, తూటాలు, జైష్‌ జెండాతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన గుజరాత్‌లో కలకలం రేపింది.

మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆటోమేటిక్ రైఫిల్‌తో గుజరాత్‌లోకి ప్రవేశించి, ఓ భద్రతా కేంద్రంపై దాడికి సిద్ధమవుతున్నట్లు గుజరాత్ ఏటీఎస్‌కు ముందుగానే సమాచారం అందింది. దీంతో అధికారులు నిఘా పెట్టి అతడి కదలికలను గుర్తించారు. ఈ క్రమంలో వడోదరలోని ఓ హోటల్‌లో ఉంటున్న అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తిని అస్సాంకు చెందిన మొహమ్మద్ ఇస్లాం కబీరుద్దీన్‌గా గుర్తించారు. తన సాధారణ మొబైల్ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి వడోదరకు వచ్చిన అతడు హోటల్‌లో బస చేస్తున్నట్లు ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి వెల్లడించారు.

నిందితుడి బ్యాగును తనిఖీ చేయగా అధికారులు షాక్‌కు గురయ్యారు. అందులో ఏకే-47 తరహా ఆటోమేటిక్ రైఫిల్‌, రెండు ఖాళీ మ్యాగజైన్లు, 23 సజీవ తూటాలు లభించాయి. వీటితో పాటు జైష్‌-ఎ-మొహమ్మద్ జెండా, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా అతడి వెనుక ఎవరున్నారు? దాడికి సంబంధించి మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ప్లాన్‌?

విచారణలో నిందితుడికి ముఫ్తీ రఫీక్ అలియాస్ ఇబ్న్ అబ్దుల్లా అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నట్లు ఏటీఎస్ గుర్తించింది. అతడు జైష్‌-ఎ-మొహమ్మద్‌కు సంబంధించిన హ్యాండ్లర్‌గా వ్యవహరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కొత్త ఫోన్ కొనుగోలు, ప్రయాణం, హోటల్ ఖర్చులు, తిరుగు ప్రయాణం కోసం సుమారు రూ.50 వేలు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, వడోదరలో దాడికి పాల్పడిన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లి జైష్‌-ఎ-మొహమ్మద్‌లో చేరాలనే ఉద్దేశంతో నిందితుడు ఉన్నట్లు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై నిందితుడిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని కోర్టులో హాజరుపరిచేందుకు, ఈ కుట్ర వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సకాలంలో నిఘా సమాచారం అందడంతోనే ఈ కుట్రను అడ్డుకోగలిగామని అధికారులు తెలిపారు.

#క్రైమ్వార్తలు
వడోదర, ఆంధ్రప్రభ: గుజరాత్‌లో భారీ ఉగ్రవాద కుట్రను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్‌ ) భగ్నం చేసింది. వడోదరలోని భారత వైమానిక దళ (ఎయిర్‌ఫోర్స్‌) కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి…