దిశ, వెబ్‌డెస్క్: ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా నిర్వహించే దీక్షా దివస్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటిచెప్పిన కీలక ఘట్టం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష అని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ సీనియర్ నాయకురాలు డా.హరి రమాదేవి మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్ష దేశ రాజకీయాల్లోనే ఒక కీలక మలుపుగా నిలిచిందని, ఆ దీక్షతో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, యువత, వివిధ ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించారని గుర్తుచేశారు.
మాతృభూమి పట్ల ప్రేమ..
తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కృషిని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సమర్థపాలనతో అతి తక్కువ కాలంలోనే తెలంగాణాను దేశంలోనే అనేక రంగాల్లో నెం.1 రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరువలేనిదని, ఆస్ట్రేలియాలో కూడా బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తున్న అనిల్ బైరెడ్డి టీంను అభినందించారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తమ మాతృభూమి పట్ల ఉన్న ప్రేమను, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్న తీరు అభినందనీయమని అన్నారు. అలాగే నవంబర్ 29న కరీంనగర్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా జరగబోయే "దీక్షా దివస్" సభకు లక్షలాదిగా హాజరై విజయవంతం చెయ్యాలని పిలుపునిస్తూ పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి, రమేష్ బాబు హరి, సత్య గుండా, రవీందర్ చుక్క, రాహుల్ నాడిదే, దీపక్ హరి, ప్రవీణ్, పవన్ రెడ్డి, నవీన్, కుల్విందర్ బజ్వా, శ్యామ్ లింగంపల్లి, రఘు, శిరీష, దీప్తి, సతీష్ మాచర్ల, కవల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.