షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 28 నవం 2026, 6:46 ఉద.
విద్య

Basar IIIT: విద్యార్థి సంపత్ మృతితో అలర్ట్.. బాసర ట్రిపుల్ ఐటీలో భద్రతా పాఠాలు

Truth into the light
ప్రచురణ తేదీ: 28 నవం 2026, 6:46 ఉద. రచన: One News Desk
9 వీక్షణలు 0 వ్యాఖ్యలు
Basar IIIT: విద్యార్థి సంపత్ మృతితో అలర్ట్.. బాసర ట్రిపుల్ ఐటీలో భద్రతా పాఠాలు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి చల్లా సంపత్ మృతి ఘటనతో క్యాంపస్‌లో విద్యార్థుల భద్రత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది. ముఖ్యంగా డిజిటల్ యుగంలో విద్యార్థులను వెంటాడుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్స్, సోషల్ మీడియా వ్యసనాలపై ట్రిపుల్ ఐటీ యాజమాన్యం అప్రమత్తమైంది. విద్యార్థులు సైబర్ ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

చదువుల ఒత్తిడి.. భవిష్యత్తుపై ఆందోళన.. మరోవైపు స్మార్ట్‌ఫోన్ ప్రపంచం.. విద్యార్థి జీవితంలో ఎన్నో సవాళ్లు. వీటికి తోడు ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్, సైబర్ మోసాలు యువతను ప్రమాదంలోకి నెడుతున్నాయి. అమాయకంగా కనిపించే లింకులు.. ఆకర్షణీయమైన ఆఫర్లు.. సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ప్రకటనలు.. చివరకు విద్యార్థులను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.

బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి చల్లా సంపత్ హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి ఆర్థికంగా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపించగా.. పోలీసులు మాత్రం తల్లికి బంగారం కొనిద్దామన్న నిర్ణయంతో ఓ జ్యువెలరీ యాప్‌లో పెట్టుబడి పెట్టి సైబర్ ఉచ్చుకు చిక్కి తీవ్రంగా నష్టపోయాడని.. మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. సంపత్ మృతిలో భిన్న ఆరోపణలు ఉన్నా ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల భద్రత, సంక్షేమంపై దృష్టి సారించాల్సిన అవసరం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే యాజమాన్యం సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.

సైబర్ ఉచ్చులో పడొద్దు!

బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎస్‌ఏసీ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ వెంకట రమణ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా మోసాలు, ఫిషింగ్ లింకులు, ఓటీపీ మోసాలు, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్‌తో కలిగే నష్టాలను వివరించారు. బెట్టింగ్ యాప్స్‌కు ఆకర్షితులై యువత ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని హెచ్చరించారు. క్యాంపస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీఎస్పీ వెంకట రామయ్య సైతం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

విద్యార్థుల భద్రతే లక్ష్యంగా..

వీసీ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా క్యాంపస్‌లో సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడంపై యాజమాన్యం దృష్టి సారించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఆన్‌లైన్ వ్యసనాలకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

#విద్య
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి చల్లా సంపత్ మృతి ఘటనతో క్యాంపస్‌లో విద్యార్థుల భద్రత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత, సంక్షేమంపై ప్రత్యేక…