దిశ, వెబ్డెస్క్: భారతీయ కుటుంబాల్లో బంగారానికి ఉన్న స్థానమే వేరు. శుభకార్యాలైనా, ఆపత్కాలంలో ఆర్థిక అవసరాలైనా ఆదుకునే ఆపద్బాంధవుడిగా పసిడి నిలుస్తుంది. అయితే, మారుతున్న ఆర్థిక పరిస్థితులు, ఆకాశాన్నంటుతున్న బంగారం ధరల నేపథ్యంలో ఇప్పుడు గోల్డ్ లోన్ తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం పెళ్లిళ్లు, వైద్య అత్యవసరాలకు మాత్రమే బంగారాన్ని తాకట్టు పెట్టేవారు. నేడు రోజువారీ కుటుంబ అవసరాలు, చిరు వ్యాపారాల పెట్టుబడులకు సైతం పసిడి రుణాలు ఒక ఇన్స్టంట్ ఏటీఎంలా మారిపోయాయి. బంగారం విలువ రికార్డు స్థాయికి చేరడంతో, తక్కువ బంగారంపైనే అధిక మొత్తం రుణంగా లభిస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తీసుకుంటున్న మొత్తం పసిడి రుణాల్లో దక్షిణాది రాష్ట్రాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం రుణాల్లో 72.1 శాతం వాటా అంటే సుమారు రూ.16.8 లక్షల కోట్లు దక్షిణాది రాష్ట్రాల నుంచే నమోదవడం గమనార్హం. ఇందులో 29.6 శాతం వాటాతో (రూ.6.9 లక్షల కోట్లు) తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా, 15.9 శాతం వాటాతో (రూ.3.7 లక్షల కోట్లు) ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో రూ.2.4 లక్షల కోట్ల రుణాలతో కర్ణాటక మూడో స్థానంలో, రూ.2.1 లక్షల కోట్లతో తెలంగాణ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక రూ.1.7 లక్షల కోట్ల పసిడి రుణాలతో కేరళ ఐదో స్థానంలో నిలిచింది.
పసిడి రుణాలు పొందుతున్న వారిలో మహిళల సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా, ద్వితీయ, తృతీయ శ్రేణి (టైర్-3) పట్టణాల్లోనూ గోల్డ్ లోన్ ఖాతాదారుల సంఖ్య 3.7 కోట్లకు చేరుకుంది. ఈ రుణాల మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకులు 54.8 శాతం వాటాతో ముందంజలో ఉన్నాయి. మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం బంగారం విలువపై రుణ పరిమితిని (ఎల్టీవీ) మూడు శ్రేణులుగా అమలు చేస్తున్నారు. రూ.2.5 లక్షల లోపు రుణాలకు బంగారం విలువలో 85 శాతం, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు 80 శాతం, రూ.5 లక్షలు దాటిన రుణాలకు 75 శాతం వరకు రుణం మంజూరు చేస్తున్నారు