దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపరంకుండ్రం (Thiruparankundram) కొండపై ఉన్న ‘దీపతూన్’ (Deepathoon - రాతి స్తంభం) వద్ద శనివారం కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాల జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఆ ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు భద్రత, నిఘా బాధ్యతలను చేపట్టాయి. కొండపై ఉన్న ఆలయంతో పాటు సికందర్ బాదుషా దర్గా, పరిసర ప్రాంతాలను సీఆర్పీఎఫ్ బలగాలు తమ అధీనంలోకి తీసుకుని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాయి. నవంబర్ 24న జరగాల్సిన దీపారాధనను అడ్డుకుని కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, శనివారం (నవంబర్ 28) అర్చకుల సంప్రదింపులతో దీపతూన్ వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలని ఆదేశించింది. అలాగే, కొండపై ఉన్న దర్గాకు అన్ని వైపులా కనీసం 50 మీటర్ల దూరంలో భక్తులు దీపాలు వెలిగించుకునేందుకు అనుమతించింది.
సికందర్ దర్గా, దాని ప్రాంగణానికి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని, దర్గాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని సీఆర్పీఎఫ్, పోలీసులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అవసరమైతే దర్గా భూమి రక్షణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు అరుళ్మిగు సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ధర్మకర్తల మండలిని (Board of Trustees) సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు, ఆలయ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్లను రిసీవర్లుగా నియమించింది. తమిళనాడు సీఎస్, డీజీపీ సహా పలువురు ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ డిసెంబర్ 15న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
సీఆర్పీఎఫ్ జవాన్లకు ఘన స్వాగతం..
తిరుపరంకుండ్రం (Thiruparankundram) కొండపై ఉన్న ‘దీపతూన్’ (Deepathoon) వద్ద శనివారం (నవంబర్ 28) కార్తీక దీపం వెలిగించాలన్న సుప్రీంకోర్టు సంచలన ఆదేశాల నేపథ్యంలో, ఆలయ భద్రత కోసం విచ్చేసిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లకు స్థానికులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం రాత్రి ఆలయ పరిసరాలకు చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాల వాహానలపై భక్తులు పూల వర్షం కురిపిస్తూ ఆత్మీయంగా ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.