New Orleans Cruise Ship Accident : అమెరికాలోని న్యూ ఓర్లీన్స్లో మిసిసిపీ నదిలో భారీ నౌక ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఓర్లీన్స్ పోర్టు వద్ద ఆగిఉన్న ఐదు అంతస్తుల అమెరికన్ హెరిటేజ్ క్రూజ్ నౌకను అట్లాంటిక్ ఆస్ఫాల్ట్ అనే భారీ ట్యాంకర్ ఢీకొట్టడంతో అది పక్కకు ఒరిగి నదిలో మునిగిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఆ సమయంలో నౌకలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 180 మంది ఉన్నారు. నీళ్లలో నౌక ఒరిగిపోయిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి నౌకలోని ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఈ ఊహించని ప్రమాదంలో సుమారు 32 మందికి గాయపడ్డారు.
ట్యాంకర్ ఢీకొట్టిన ధాటికి క్రూయిజ్ నౌక అద్దాలు, లోహపు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఒక్కసారిగా నీరు లోపలికి వచ్చి చేరడంతో కొద్దిసేపటికే అది ఒకవైపునకు ఒరిగి బోల్తాపడింది. దీంతో కొందరు ప్రయాణికులు నదిలో పడిపోయారు. పలువురు లైఫ్ జాకెట్లు ధరించి నీటిలో ఉండగా, మరికొందరు నౌక అంచులను పట్టుకుని సహాయం కోసం ఆర్తనాధాలు చేశారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కోస్ట్ గార్డ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. నదిలో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు సమీపంలోని టగ్ బోట్లు, ఇతర నౌకల సిబ్బంది కూడా సహకరించారు. మొత్తం 180 మంది ప్రాణాలతో బయటపడినట్లు న్యూ ఓర్లీన్స్ మేయర్ హెలెనా మోరెనో వెల్లడించారు. ఈ ప్రమాదంలో 32 మందిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. ట్యాంకర్లో ఉన్నవారికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు.
ట్యాంకర్ స్టీరింగ్ వ్యవస్థలో సమస్య తలెత్తి అదుపు తప్పడంతోనే క్రూయిజ్ నౌకను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి (ఎన్టీఎస్బీ) దర్యాప్తు చేపట్టనుంది. ప్రమాదం కారణంగా మిసిసిపీ నదిలోని కొంత ప్రాంతంలో నౌకల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ ప్రమాదం జరిగినప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రాణాలతో బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.