దిశ, నేషనల్ బ్యూరో: యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులే అడ్డుకున్నారని, నేడు పార్టీ అనుభవిస్తున్న కష్టాలకు అదే ప్రధాన కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2009-11 మధ్య తాను న్యాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా జైలుకు వెళ్లడంతో పాటు రాష్ట్ర బహిష్కరణకు గురయ్యారని, ఆ తర్వాత నరేంద్ర మోడీ కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఉన్నప్పటికీ సొంత ప్రభుత్వమే ఆయనపై విచారణను నిలిపివేసిందని ఆరోపించారు. ఈ పరిణామానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కారణం కాదని, పార్టీలో ‘యథాతథ స్థితి’ కొనసాగాలని కోరుకున్న కొందరు నాయకుల వల్లే ఇది జరిగిందని మొయిలీ స్పష్టం చేశారు. అంతేకాకుండా, పార్టీలో విప్లవాత్మక మార్పుల కోసం సోనియా గాంధీ తన నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను ఆ నాయకులు అమలు చేయకుండా అడ్డుకున్నారని, ఒకవేళ ఆ సంస్కరణలను అమలు చేసి ఉంటే మోడీ అసలు అధికారంలోకి వచ్చేవారే కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Veerappa Moily: యూపీఏ హయాంలో మోడీపై విచారణను అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే