దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6’ (GTA 6) వీడియో గేమ్ విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. 2013లో ‘జీటీఏ 5’ విడుదలైనప్పటి నుంచి నేడు ‘జీటీఏ 6’ విడుదలయ్యే వరకు.. గడిచిన 13 ఏళ్లలో భారతదేశం ఏ విధంగా అప్‌గ్రేడ్ అయిందో వివరిస్తూ ఆయన ఈ పోస్ట్‌ను పంచుకున్నారు. “భారత్ ఇప్పుడు ఒక సరికొత్త ఆట ఆడుతోంది” అనే క్యాప్షన్‌తో, జీటీఏ గేమ్‌లకు గుర్తింపుగా నిలిచే ప్రత్యేకమైన ‘ప్రైస్డౌన్’ (Pricedown) ఫాంట్‌ను ఉపయోగించి రూపొందించిన గ్రాఫిక్ కార్డులను ఆయన షేర్ చేశారు.
గత యూపీఏ ప్రభుత్వ హయాంతో పోలుస్తూ.. గడిచిన దశాబ్ద కాలంలో దేశం సాధించిన కీలక మైలురాళ్లను ప్రధాని తన పోస్ట్‌లో ప్రస్తావించారు. 2013 ఆగస్టులో మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు భారత్ సహా ఐదు దేశాలను విదేశీ పెట్టుబడులపై అతిగా ఆధారపడే బలహీన ఆర్థిక వ్యవస్థలుగా (‘ఫ్రజైల్ 5’ – Fragile 5) అభివర్ణించారని, అయితే నేడు భారత్ ఆ జాబితా నుంచి బయటపడి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనితో పాటు పేదరికంలో గణనీయమైన తగ్గుదల, పారిశుధ్య మిషన్ పూర్తి, సౌర విద్యుత్ సామర్థ్యంలో భారీ వృద్ధి, దేశవ్యాప్తంగా విద్యుదీకరణ పెరుగుదల, అలాగే దేశంలో 440 స్పేస్ టెక్నాలజీ స్టార్టప్‌లు నమోదు కావడం వంటి విజయాలను ఇందులో వివరించారు.
యువతను, ముఖ్యంగా గేమింగ్ కమ్యూనిటీని ఆకట్టుకునేలా ఇంటర్నెట్ ధరల తగ్గుదలను కూడా ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో ఒక జీబీ (GB) హై-స్పీడ్ ఇంటర్నెట్ ధర రూ. 308 ఉండగా, నేడు అది రూ.7.51కి దిగివచ్చిందని తెలిపారు. వీటితో పాటు భారత్ నక్సలిజం రహిత దేశంగా మారడం, ప్రముఖ రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదగడం వంటి అంశాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. పాప్ కల్చర్ రిఫరెన్సులతో యువతకు చేరువయ్యే ప్రధాని మోడీ శైలికి నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. ఈ పోస్ట్ పెట్టిన 10 నిమిషాల్లోనే దాదాపు 60 వేల లైకులు, 2 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. “ఇప్పటివరకు ఉన్న ప్రధానుల్లో అత్యంత కూల్ ప్రధాని” అని కొందరు, “ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్”, “ఓజీ క్రియేటర్” (OG creator) అంటూ మరికొందరు యూజర్లు ప్రశంసలు కురిపించారు. కాగా.. జీటీఏ 5 విడుదలైన 13 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ ‘జీటీఏ 6’ గేమ్ తయారీకి సుమారు 1 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చయినట్లు అంచనా. డిజిటల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘సెన్సార్ టవర్’ నివేదిక ప్రకారం.. విడుదల కాకముందే ప్రీ-ఆర్డర్ల ద్వారానే ఈ గేమ్ దాదాపు 1.1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించి, చరిత్రలోనే అతిపెద్ద ప్రీ-ఆర్డర్ లాంచ్‌గా రికార్డు సృష్టించింది.