దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం (EC) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ తరుణంలో ఢిల్లీలోని ముస్తఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల పేర్లను తొలగించేందుకు తప్పుడు ‘ఫారం-7’ దరఖాస్తులు దాఖలయ్యాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇవాళ ఆదేశించింది.
నకిలీ దరఖాస్తులపై విచారణ..
సాధారణంగా ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పులపై అభ్యంతరం తెలిపేందుకు, జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు ‘ఫారం-7’ ఉపయోగిస్తారు. అయితే, ముస్తఫాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సందర్భంగా నకిలీ, మోసపూరిత ‘ఫారం-7’ దరఖాస్తులు వెల్లువెత్తాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
బతికున్న వారినీ మరణించినట్లుగా చూపిస్తూ…
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పలు కీలక అంశాలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ముస్తఫాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల పేర్లను తొలగించాలని కోరుతూ కొందరు బూత్ స్థాయి ఏజెంట్ల (BLAs) పేర్లతో ఫారం-7 దరఖాస్తులు దాఖలయ్యాయని, అయితే తాము అలాంటి దరఖాస్తులేవీ చేయలేదని స్వయంగా ఆ ఏజెంట్లే తర్వాత స్పష్టం చేసినట్లు వచ్చిన వార్తా కథనాలను పిటిషన్లో ప్రస్తావించారు. ఓటర్లు మరణించారని, వేరే ప్రాంతానికి వెళ్లిపోయారని పేర్కొంటూ దాఖలైన ఫారం-7 దరఖాస్తుల్లో.. చాలామంది సజీవంగా ఉన్నారని, పైగా అదే చిరునామాలో నివసిస్తున్నారని కథనాలు వచ్చినట్లుగా న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ అక్రమాలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి, ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారికి (CEO) వినతిపత్రాలు సమర్పించినట్లుగా ఆయన ధర్మాసనానికి తెలిపారు. పూర్తి వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం.. పిటిషనర్ సమర్పించిన వినతిపత్రాన్ని సంబంధిత ఎన్నికల అధికారులు తప్పకుండా పరిశీలిస్తారని అని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.