దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు పెట్టుబడుల రహస్య సమాచారం ఏపీకి లీక్ చేశారన్న ఆరోపణలతో 15 మంది సీనియర్ అధికారులపై విజయ్ ప్రభుత్వం వేటు వేసినట్టు వార్తలు వస్తున్నాయి. తమిళనాడు పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ అయిన గైడెన్స్ తమిళనాడుకు చెందిన 15 మంది సీనియర్ అధికారులు పెట్టుబడులకు సంబంధించి అత్యంతకీలకమైన సమాచారం లీక్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. సమాచారం లీక్ అవ్వడంతో తమిళనాడుకు రావాల్సిన కొన్ని ప్రాజెక్టులు ఏపీకి వెళ్లాయని ప్రచారం జరుగుతోంది. దీంతో కార్మికశాఖ మంత్రి కీర్తన వారిపై వేటు వేసినట్టు వార్తలు రాగా, ఇప్పుడు ఈ వివాదం రాజకీయ మలుపు తిరిగింది.
అధికారుల్లో కొందరిని గతంలో ఏఐఏడీఎంకే ప్రభుత్వ నియమించగా, ఆ తరవాత వచ్చిన డీఎంకే ప్రభుత్వంలోనూ వీరు కొనసాగినట్టు తెలుస్తోంది. సస్పెండ్ అయినవారిలో ముగ్గురు అధికారులు ఏపీ ప్రభుత్వానికి సమాచారం చేరవేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తమిళనాడు పెట్టుబడి ప్రోత్సాహక ప్రయత్నాలను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఇది జరిగిందని, కార్మిక శాఖ మంత్రి కీర్తనను లక్ష్యంగా చేసుకుని ఇలా చేశారని టీవీకే నేతలు అంటున్నారు. ఈ వివాదంతో ప్రతిపక్షనేతలు ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు.