దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో భారత రూపాయి శుక్రవారం భారీ లాభాలతో అదరగొట్టింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 65 పైసలు బలపడి 92.67 (తాత్కాలికం) వద్ద స్థిరపడింది. దీంతో ఈ ఏడాదిలో ఏప్రిల్ తర్వాత తొలిసారిగా రూపాయి 93 మార్కు కంటే బలమైన స్థాయికి చేరుకోవడం విశేషంగా నిలిచింది. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత మదుపరుల (FIIs) పెట్టుబడులు భారీగా తరలి రావడం రూపాయికి ప్రధాన బలాన్నిచ్చింది. నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీ లాభాలతో (సెన్సెక్స్ 897 పాయింట్లు, నిఫ్టీ 286 పాయింట్లు) ముగియడం ఫారెక్స్ సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు తగ్గుముఖం పట్టడం దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్‌ను తగ్గించి రూపాయి పుంజుకోవడానికి దోహదపడింది. గత కొంతకాలంగా ఒత్తిడిలో ఉన్న రూపాయిపై విదేశీ ఇన్వెస్టర్లు తమ ప్రతికూల బెట్టింగ్‌లను ఉపసంహరించుకోవడంతో పాటు డాలర్ విలువ కాస్త బలహీనపడటం కూడా రూపాయికి కలిసొచ్చింది.
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి దూకుడు.. డాలర్‌తో పోలిస్తే 65 పైసలు హైక్