Prakasam | కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి!
నూతన వధూవరులకు స్వల్ప గాయాలు
తిరుపతి నుంచి బాపట్లకు వస్తుండగా ఘోర ప్రమాదం
డ్రైవర్ నిద్రమత్తే కారణమని ప్రాథమిక అంచనా
Prakasam | ప్రకాశం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తున్న కారు కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న నూతన వధూవరులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలో వివాహ వేడుక ముగించుకుని నూతన వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు కారులో బాపట్లకు బయలుదేరారు. ప్రకాశం జిల్లా పెళ్లూరు సమీపంలోకి చేరుకోగానే కారు అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ప్రవీణ్‌తో పాటు వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో నూతన వధూవరులు శ్రీతేజ, కౌశల్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వధూవరులను 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే కారు అదుపుతప్పి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెళ్లి వేడుకతో ఆనందంగా తిరిగి వస్తున్న కుటుంబంలో ఈ ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది.