దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కృత్రిమ మేధస్సు (AI) పరిశోధనలను బలోపేతం చేసేందుకు, విద్యావకాశాలను విస్తరించేందుకు టెక్ దిగ్గజం గూగుల్ 5 మిలియన్ డాలర్లే అంటే భారత కరెన్సీలో సుమారు రూ.46.34 కోట్లు నిధులను విరాళంగా ప్రకటించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ 75వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ కీలక ప్రకటన వెలువడింది. ఈ నిధుల మంజూరులో ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక పాత్ర పోషించారని సంస్థ డైరెక్టర్ సుమన్ చక్రవర్తి తెలిపారు. తమ పూర్వ విద్యార్థి గూగుల్ వంటి దిగ్గజ సంస్థకు నాయకత్వం వహించడం గర్వకారణమని, ఆయన చొరవతోనే ఈ నిధులు అందాయని డైరెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆ మూడు విభాగాల్లో..
తాజాగా గూగుల్ ప్రకటించిన విరాళాలతో భారతీయ భాషలు (Indic languages), వ్యవసాయం, మెటీరియల్ సైన్స్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు ఏఐ పరిశోధనలను ప్రోత్సహించనున్నారు. విద్యార్థులు, అధ్యాపకులకు ఏఐ శిక్షణను అందించడం, నూతన పాఠ్యాంశాలను (Curriculum) అభివృద్ధి చేయనున్నారు. క్యాంపస్ వ్యాప్తంగా సాంకేతిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఏఐ ఫ్రేమ్‌వర్క్‌లు, టూల్స్, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తారు. అయితే, భారీ విరాళంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందిస్తూ.. ఐఐటీ ఖరగ్‌పూర్ ఇప్పటికే భారతీయ భాషలు, వ్యవసాయం, విద్యా రంగాల్లో అద్భుతమైన కృషి చేస్తోందని, ఈ కొత్త భాగస్వామ్యం ద్వారా ఆ ప్రగతిని మరింత వేగవంతం చేసేందుకు గూగుల్ ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు. తన జీవితాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్ తీర్చిదిద్దినట్లే, ఈ సహకారం రాబోయే తరం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఆశిస్తున్నట్లుగా ఆయన ఆకాంక్షించారు.