దిశ, డైనమిక్ బ్యూరో: వరకట్న దాహం ఓ పెళ్లిని పీటల మీదే ఆపేసింది. ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కట్నంగా తాను కోరిన కారు ఇవ్వడం లేదని చివరి నిమిషంలో పెళ్లి ఆపేశాడు. హర్యానాలోని సోనిపట్‌లో నవంబర్ 20న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో వరుడి కుటుంబం కోరికలు తీర్చలేక వధువు తండ్రి మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పెళ్లి నిశ్చయమైన నాటి నుంచే డిమాండ్లు:
సోనిపట్‌కు చెందిన సుభాష్ కుమార్ తన కుమార్తె హీనా వివాహాన్ని ఆరు నెలల క్రితం ఢిల్లీ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న కుల్దీప్తో నిశ్చయించారు. నవంబర్ 20న సోనిపట్‌లోని మామ్‌చంద్ వాటికలో వీరి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచే వరుడి తరఫు వారు కారు, బంగారు ఆభరణాల కోసం డిమాండ్లు మొదలుపెట్టారని వధువు తండ్రి సుభాష్ ఆరోపించారు. వరుడి కోసం సుభాష్ ఇప్పటికే సుమారు రూ. 9.5 లక్షల విలువైన హ్యుందాయ్ ఆరా కారును బుక్ చేశారు. అయితే పెళ్లికి ఒకరోజు ముందు మధ్యవర్తుల ద్వారా కుల్దీప్కు ఆ కారు నచ్చలేదని తనకు రూ.13 లక్షల విలువైన మారుతి బ్రెజా కారు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆరా బుకింగ్ రద్దు చేసి బ్రెజా కారు కోసం ప్రయత్నించినప్పటికీ సమయం తక్కువగా ఉండటంతో వీలుపడలేదు.
పందిట్లో వధువు.. కారు కోసం వరుడి రచ్చ:
పెళ్లి రోజున వరుడు కుల్దీప్ ఊరేగింపుగా కాకుండా, తన తల్లితో కలిసి సాధారణ దుస్తుల్లో పెళ్లి మండపానికి వచ్చాడు. అక్కడ బ్రెజా కారు కనిపించకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వరుడు తమ కుటుంబాన్ని దూషించడమే కాకుండా, వధువు సోదరుడు సాహిల్‌తో గొడవకు దిగాడని సుభాష్ ఆరోపించారు. పెళ్లి జరిపించాలని బంధువులంతా కుల్దీప్, అతని తల్లి కాళ్లావేళ్లా పడి వేడుకున్నా వారు కనికరించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వధువు హీనా పెళ్లి దుస్తుల్లో మండపంలోనే వరుడి కోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది. దీంతో తమకు తీవ్ర అవమానం, ఆర్థిక నష్టం జరిగిందని వధువు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇరువర్గాలు డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించాయి. వధువు తండ్రి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.