దిశ, వెబ్ డెస్క్: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి కరోలిన్ లీవిట్ తప్పుకున్నప్పటి నుంచి ఆ స్థానంలో సమర్థవంతమైన మరో వ్యక్తిని నియమించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద సవాలుగా మారింది. ఆగస్టులో ఆమె ఈ బాధ్యతల నుంచి వైదొలగగా, ఇటీవల కేటీ జకారియాను ఆ పదవిలో నియమించారు. అయితే.. పనితీరుపై విమర్శలు, అర్హతల విషయంలో వివాదాలు తలెత్తడంతో కేవలం ఐదు రోజుల్లోనే కేటీ ఆ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన ట్రంప్.. మాజీ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పనితీరును ఆకాశానికెత్తడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరోలిన్ తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం వల్లే ఇప్పుడు ఆమెకు సరైన ప్రత్యామ్నాయాన్ని వెతకడం కష్టమవుతోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. “అసలు సమస్య అంతా కరోలిన్ వల్లే వచ్చింది. ఆమె అద్భుతంగా పనిచేయడం వల్ల ఇప్పుడు ఆ స్థాయిలో మరొకరిని తీసుకురావడం పెద్ద సమస్యగా మారింది. ఈ విషయాన్ని నేను నేరుగా ఆమెకే చెప్పాను” అని ట్రంప్ పేర్కొన్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి విధుల్లోకి రావాలని కోరినప్పటికీ, దేశాధ్యక్షుడినైన తనకంటే తన బిడ్డనే ఆమె ఎక్కువగా ప్రేమిస్తోందని, అందుకే కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన చమత్కరించారు.
కరోలిన్ తీసుకున్న ఆ నిర్ణయం ఎంతో గొప్పదని అభినందించిన ట్రంప్, ప్రస్తుతం ఆమె ఓ ప్రముఖ మీడియా సంస్థలో (ఫాక్స్ న్యూస్) చేరిందని, తన ప్రతిభతో త్వరలోనే ఒక పెద్ద స్టార్‌గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవి కోసం దాదాపు 100 మంది వరకు ఆసక్తి చూపుతున్నప్పటికీ, కరోలిన్ స్థానాన్ని భర్తీ చేయగల సరైన అభ్యర్థి కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతోందని ట్రంప్ స్పష్టం చేశారు.