Sathya Velugu, 23 నవంబర్ 2026: క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది
తొర్రూరు, ఆంధ్రప్రభ :
తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా అతివేగంతో ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో భాస్కర్ అనే వ్యక్తి కాలి ఎముక విరిగి తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న దంతాలపల్లి 108 వాహనం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ తీవ్ర గాయాలతో ఉన్న బాధితులకు 108 అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు (ఈఎంటీ) ఎలమద్రి ప్రభాకర్ చాకచక్యంగా ప్రథమ చికిత్స అందించారు.
అనంతరం అంబులెన్స్ పైలట్ ఎనుగంటి రమేష్ వాహనాన్ని వేగంగా నడిపి, క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆపద సమయంలో క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించి బాధితులకు అండగా నిలిచిన 108 సిబ్బంది ప్రభాకర్, రమేష్ సేవలను అక్కడి ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు.