Sathya Velugu, 26 నవంబర్ 2026: దిశ, వెబ్‌డెస్క్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక చమురు డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంగ్ నా జిల్లాలోని బ్యాంగ్చాక్ చమురు డిపోలో జరిగిన భారీ పేలుడు కారణంగా ఈ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలలో దట్టమైన నల్లటి పొగ, ఎత్తైన మంటలు పైకి ఎగసిపడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పేలుడు జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. “బ్యాంగ్చాక్ చమురు డిపోలో పేలుడు సంభవించింది. ప్రజలు తమ స్వీయ రక్షణ కోసం పరిసర ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని కోరుతున్నాము” అని బ్యాంగ్నా జిల్లా కార్యాలయం తమ అధికారిక ఫేస్బుక్ పేజీలో ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ పేలుడుకు గల కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ సమాచారం అందలేదు. థాయ్ ఎంక్వైరర్ కథనం ప్రకారం.. అగ్నిమాపక సిబ్బంది మరియు సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులను కూడా సురక్షితంగా తరలించారు. ప్రజలు ప్రమాద స్థలానికి దూరంగా ఉండాలని, అధికారులు జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. తూర్పు బ్యాంకాక్‌లో విస్తరించి ఉన్న ఈ చమురు డిపోను థాయ్ ఇంధన దిగ్గజం బ్యాంగ్చాక్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. రోజుకు 1,20,000 బ్యారెళ్ల సామర్థ్యం కలిగిన ఈ డిపో థాయ్‌లాండ్‌లో ఐదవ అతిపెద్దది కాగా, పట్టణ ప్రాంతంలో ఉన్న ఏకైక చమురు డిపో ఇదే కావడం గమనార్హం.