Sathya Velugu, 27 నవంబర్ 2026: దిశ, వెబ్ డెస్క్: నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) సంస్కరణల బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుల చొరవతో ఎన్డీయే ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేసే కీలక సంస్కరణలను ముందుకు తీసుకెళ్తోందని ఆయన కొనియాడారు.
అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను 50 శాతం పెంచుతూనే, 2051 వరకు ప్రస్తుత దామాషా ప్రాతినిధ్యాన్ని (Proportional representation) యధాతథంగా కొనసాగించాలని ప్రతిపాదించడం అభినందనీయమని పవన్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయాలను గుర్తిస్తూనే, పార్లమెంట్లో వాటి వాటాకు భద్రత కల్పించడం సమాఖ్య స్ఫూర్తికి (Cooperative federalism) నిదర్శనమని తెలిపారు.
మహిళలకు 33% రిజర్వేషన్లతో మరింత సాధికారత
లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదన చట్టసభల్లో, నిర్ణయాత్మక ప్రక్రియల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడి గళం వినిపించినప్పుడే, ప్రతి ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం లభించినప్పుడే బలమైన ప్రజాస్వామ్యం నిర్మితమవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ కీలక జాతీయ సంస్కరణకు జనసేన పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తోందని ప్రకటించిన ఆయన, ప్రజాస్వామ్య విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు రాజకీయ విభేదాలకు అతీతంగా ముందుకు వచ్చి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.