Sathya Velugu, 28 నవంబర్ 2026: దిశ, వెబ్‌డెస్క్: అఫ్గానిస్తాన్ తూర్పు ప్రాంతంలోని కునార్ ప్రావిన్స్‌లో శనివారం సంభవించిన భారీ పేలుడులో కనీసం ఏడుగురు విద్యార్థులు మరణించగా, మరో 97 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక మాధ్యమిక పాఠశాల పక్కనే ఉన్న నివాసంలో ఈ పేలుడు చోటుచేసుకోవడంతో, విద్యాసంస్థల సమీపంలో పేలుడు పదార్థాల నిల్వపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అందార్ సెర్ (Andar Ser) ప్రాంతంలో శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు) ఈ దుర్ఘటన జరిగింది. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 100 మంది ఈ ప్రమాద బాధితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నందున మృతులు, క్షతగాత్రుల సంఖ్య మారే అవకాశం ఉందని వైద్య అధికారులు వెల్లడించారు.
పాఠశాల పక్క ఇంట్లో డైనమైట్ నిల్వలే కారణం
కునార్ ప్రావిన్షియల్ ఆసుపత్రి అధిపతి మౌలా దాద్ ‘అల్ జజీరా’ (Al Jazeera) వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో కనీసం ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, 97 మంది గాయపడ్డారని ధృవీకరించారు. ఇవి ప్రాథమిక గణాంకాలు మాత్రమేనని, మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మాధ్యమిక పాఠశాల పక్కనే ఉన్న ఓ ఇంట్లో ఈ పేలుడు సంభవించిందని కునార్ సమాచార, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మౌలవీ సమీ-ఉల్-హక్ తెలిపారు. ఆ ఇల్లు గనుల తవ్వకం (మైనింగ్) కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులకు చెందినదని, వారు తమ ఇంట్లో భారీ ఎత్తున డైనమైట్ నిల్వ ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే, పేలుడుకు గల కచ్చితమైన కారణాలు, నష్టం తీవ్రతపై ఆయన మరిన్ని వివరాలు వెల్లడించలేదు.
పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న కునార్ ప్రావిన్స్‌కు చెందిన దర్యాప్తు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయంపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
గతంలోనూ పాఠశాలపై గ్రనేడ్ దాడి:
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఒక పాఠశాల సముదాయంపై జరిగిన దాడి జరిగిన కొన్ని నెలలకే ఈ తాజా విషాదం చోటుచేసుకోవడం గమనార్హం. గత ఆగస్టులో కాబూల్‌లోని పాఠశాలపై జరిగిన హ్యాండ్ గ్రనేడ్ దాడిలో 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న 40 మందికి పైగా చిన్నారులు గాయపడ్డారు. తాజా పేలుడులో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.