Sathya Velugu, 29 నవంబర్ 2026: ఈ-రిక్షా ఛార్జింగ్ పాయింట్ నుంచి మంటలు వ్యాపించినట్లు అనుమానం
మొదటి అంతస్తులో నిద్రిస్తున్న వారిపై ప్రభావం
క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందన్న పోలీసులు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. విశ్వాస్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ-రిక్షా ఛార్జింగ్ పాయింట్ వద్ద మంటలు ప్రారంభమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
విశ్వాస్ నగర్లోని లేన్ నంబర్ 11లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది ఒక వాటర్ ట్యాంకర్, ఒక వాటర్ బారెల్, ఒక క్విక్ రెస్పాన్స్ వాహనంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించినట్లు షహదారా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాజేంద్ర ప్రసాద్ మీనా ధ్రువీకరించారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
పోలీసులకు అగ్నిప్రమాదంపై సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్నామని డీసీపీ వివరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ-రిక్షా ఛార్జింగ్ పాయింట్ వద్ద మంటలు ప్రారంభమై ఉండవచ్చని చెప్పారు. మొదటి అంతస్తులో నిద్రిస్తున్న వారిపై మంటల ప్రభావం పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.