నిర్మల్ జిల్లా పెద్దూరు రైస్ మిల్లులో వెలుగుచూసిన ధాన్యం కుంభకోణం
సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో మిల్లు యజమాని అరెస్ట్
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ :
కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగంలోకి దిగడంతో రైస్ మిల్లుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ నుంచి పొందిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా, కొందరు మిల్లర్లు ఆ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వ్యవహారం కలకలం రేపుతోంది. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఇప్పటికే విజిలెన్స్ విచారణలు పూర్తి చేసిన అధికారులు ధాన్యం కుంభకోణం అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని సత్తెనపల్లిలో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ అధికారులు పది గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. తాజాగా ఇదే జిల్లాలోని కడెం మండలం పెద్దూరులో శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ రైస్ మిల్లులో భారీ అక్రమాలు వెలుగుచూడటంతో సివిల్ సప్లై జిల్లా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలు రైస్ మిల్లర్లలో ఆందోళనకు దారితీస్తున్నాయి.
రైస్ మిల్లు యజమాని అరెస్ట్
కడెం మండలం పెద్దూరు గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ రైస్ మిల్లులో ధాన్యం కుంభకోణం జరిగినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. సీఎంఆర్ కింద సేకరించిన ధాన్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించకపోవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. సుమారు 3,925 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లు యజమాని గుండ ప్రసాద్ అక్రమంగా నిల్వ ఉంచుకున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఈ ధాన్యం విలువ దాదాపు రూ.14.36 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.
తనిఖీల్లో ఈ అక్రమాలను గుర్తించిన జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ సుధాకర్, మిల్లు యజమానిపై గురువారం రాత్రి కడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి మిల్లు యజమాని గుండ ప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖానాపూర్ సీఐ సత్యనారాయణ తెలిపారు. కాగా, ఇదే జిల్లాలో ఈడీ బృందాలు రైస్ మిల్లులో సోదాలు నిర్వహించిన అనంతరం పౌరసరఫరాల శాఖ అధికారులు ఆలస్యంగా మేల్కొని చర్యలకు ఉపక్రమించడం చర్చనీయాంశంగా మారింది. మరో రెండు రైస్ మిల్లుల యజమానులను కూడా రెండు మూడు రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.