- జన్నారం మండల కేంద్రంలో పోలీసుల తనిఖీలు
- నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరిక
జన్నారం, ఆంధ్రప్రభ: ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా స్మోకింగ్ జోన్లు నిర్వహిస్తున్న ముగ్గురు యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మంగళవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించిన పోలీసులు ఈ అక్రమ నిర్వహణను గుర్తించారు.తనిఖీల్లో భాగంగా అనుమతులు లేకుండా పాన్‌షాపులతో పాటు స్మోకింగ్ జోన్లు నిర్వహిస్తున్న పొనకల్‌కు చెందిన గుర్రాల భరత్, రామటెంకి రాజయ్య, గుర్రాల వెంకటసాయిపై కేసులు నమోదు చేసినట్లు తనిఖీ ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ రాత్రి 9.30 గంటలకు వెల్లడించారు.
ప్రజారోగ్యానికి హాని కలిగిస్తే చర్యలు
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ధూమపానం చేసేవారితో పాటు సమీపంలో ఉండే ఇతరులు కూడా పరోక్షంగా పొగకు గురై ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిపై పొగ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.ప్రజారోగ్య పరిరక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధ నిబంధనలు ఉల్లంఘించడం, సరైన అనుమతులు లేకుండా స్మోకింగ్ జోన్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
టీ దుకాణాలు, పాన్‌షాపులు, కిరాణా దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగానే వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. చట్టాలను ఉల్లంఘించే వారిపై సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై ఉదయ్ కిరణ్ హెచ్చరించారు.