వివాహేతర సంబంధం కోసం భార్యకు వేధింపులు
నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
కరీంనగర్ క్రైం, ఆంధ్రప్రభ : కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో ఈ నెల 9వ తేదీన వివాహిత శ్రావంతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఆమె భర్త కొత్తూరి సంపత్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాకు చెందిన ఇమ్మడి ముత్తయ్య తన కుమార్తె శ్రావంతిని సుమారు 11 సంవత్సరాల క్రితం కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామానికి చెందిన కొత్తూరి సంపత్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అయితే గత కొంతకాలంగా సంపత్ వివిధ విషయాల్లో భార్య శ్రావంతిని వేధించేవాడు. అంతేకాకుండా రెండేళ్లుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన ఓ మహిళతో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తనను వివాహం చేసుకోవాలంటే భార్యను వదిలించుకోవాలని సదరు మహిళ సంపత్‌పై ఒత్తిడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో భార్యను వదిలించుకోవాలనే ఉద్దేశంతో సంపత్ ఆమెను తరచూ వేధించేవాడు.
ఈ నెల 9వ తేదీ రాత్రి సంపత్ తన మొబైల్ ఫోన్లో సదరు మహిళతో వీడియో కాల్స్, చాటింగ్ చేస్తుండగా శ్రావంతి గమనించి భర్తను నిలదీసింది. దీంతో తాను మరో మహిళను ప్రేమిస్తున్నానని, ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పడంతో పాటు, నువ్వు బతికితే బతుకు.. చస్తే చావు అంటూ దురుసుగా మాట్లాడినట్లు విచారణలో వెల్లడైంది. భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావంతి తన భవిష్యత్తుతో పాటు ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆవేదన చెందింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లోని పిల్లల బెడ్రూమ్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఉదయం సుమారు 8 గంటలకు నిద్రలేచిన సంపత్ భార్య ఉరివేసుకొని ఉండటాన్ని గమనించాడు. అయితే తనపై అనుమానం రాకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్లోని చాటింగ్స్, మెసేజ్‌లను తొలగించి, బంధువులు, తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి సమాచారం అందించి ఏమీ తెలియనట్లు నటించినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం శ్రావంతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఇమ్మడి ముత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు సంపత్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలోని జైలు బంక్ వద్ద సంపత్ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా సిరికొండకు చెందిన మహిళతో జరిపిన చాటింగ్స్, మెసేజ్‌లు, వీడియో కాల్స్‌కు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. వాటి ఆధారంగా సదరు మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌తో పాటు, ఆ మహిళను కలుసుకోవడానికి ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి సంపత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.