మృతదేహాన్ని తొలుత పూడ్చిపెట్టి..
ఆపై గోదావరిలో పడేసిన నిందితులుసీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో పట్టుకున్న పోలీసులు
కొత్తగూడెం క్రైమ్, ఆంధ్రప్రభ : భార్యను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడైన భర్తకు సహకరించిన అతని తండ్రి, సోదరుడు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని తొలుత పత్తి చేనులో పూడ్చిపెట్టి, అనంతరం బయటకు తీసి గోదావరి నదిలో పడేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 205/2026, బీఎన్ఎస్ సెక్షన్లు 103, 238 రెడ్‌విత్ 3(5) కింద కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు బోడా నరేందర్‌కు సహకరించిన అతని తండ్రి బోడా హరిలాల్, సోదరుడు బోడా సురేందర్, స్నేహితుడు మాలోత్ శోభన్‌లను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. బోడా నరేందర్ 2025లో గంగారపు భవానీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కులాంతర వివాహం చేసుకోవడాన్ని అతని తండ్రి హరిలాల్, సోదరుడు సురేందర్ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా భవానీని వదిలించుకోవాలని నరేందర్‌పై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో తండ్రి, సోదరుడితో కలిసి నరేందర్ భార్యను హత్య చేసేందుకు పథకం రూపొందించాడు. ఇందులో భాగంగా నవంబర్ 3, 2026 రాత్రి భవానీ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తండ్రి హరిలాల్ సహాయంతో గోలియతండా గ్రామ శివారులోని తమ పత్తి చేనులో గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో విషయం బయటపడుతుందనే భయంతో నవంబర్ 4న మరో పథకం రచించారు. రాత్రి సమయంలో మృతదేహాన్ని బయటకు తీసి శుభ్రం చేసి, దుస్తులు మార్చి రెండు తెల్లని ప్లాస్టిక్ సంచుల్లో చుట్టారు. అనంతరం మోటార్ సైకిళ్లపై భద్రాచలం వైపు తరలించారు. నరేందర్ తన తండ్రి హరిలాల్తో కలిసి ఒక మోటార్ సైకిల్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లగా, సోదరుడు సురేందర్, స్నేహితుడు మాలోత్ శోభన్ మరో మోటార్ సైకిల్‌పై ముందుగా వెళ్లారు. పోలీసుల గస్తీ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఎస్కార్ట్‌గా వ్యవహరించారు. అనంతరం భద్రాచలం పాత వంతెన సమీపంలోని గోదావరి నదిలో మృతదేహాన్ని పడేసి గ్రామానికి తిరిగి వచ్చారు.
ఈ క్రమంలో నవంబర్ 6న భవానీ కనిపించడం లేదని ఆమె అక్క స్వరూప కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ప్రధాన నిందితుడు నరేందర్ భార్యను హత్య చేసిన విషయాన్ని వెల్లడించడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తదుపరి దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు మిగిలిన నిందితుల పాత్రను గుర్తించారు. పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న హరిలాల్, సురేందర్, శోభన్‌లను శనివారం ఉదయం 11.40 గంటలకు లక్ష్మీదేవిపల్లి మండలంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ ఆదినారాయణ, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు యాయాతి రాజు, రమేష్‌తో పాటు పోలీస్ సిబ్బంది రాజు, మురళి, చిరంజీవిలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అభినందించారు.