దిశ, డైనమిక్ బ్యూరో: దేశలో వాహనాల ద్వారా జరుగుతున్న వాయుకాలుష్యం విషయంలో ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహన కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం (Pollution Under Control – PUC) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. వాహనాల ఉద్గార ప్రమాణాలు, వాహనం మొదటిసారి రిజిస్ట్రేషన్ అయిన తేదీ ఆధారంగా PUC సర్టిఫికెట్ చెల్లుబాటు వ్యవధిని నిర్దేశించింది. దీంతో బీఎస్-6 వాహనదారులకు ఇకపై మూడేళ్లకోసారి పీయూసీ సర్టిఫికెట్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ‘సెంట్రల్ మోటార్ వెహికల్స్ (16వ సవరణ) రూల్స్, 2026’ పేరిట అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు గెజిట్ ప్రచురించిన తేదీ 16 నవంబర్ 2026 నుంచే తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.
వాహనాల కేటగిరీల వారీగా PUC గడువు:
కొత్త నిబంధనల ప్రకారం వాహనాల కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు వ్యవధిని వాహనాల కేటగిరీల వారీగా నిర్ణయించారు.
BS-I, BS-II, BS-III వాహనాలు: మూడు నెలల పాటు PUC సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది.
BS-IV వాహనాలు: ఆరు నెలల పాటు సర్టిఫికెట్ చెల్లుబాటులో ఉంటుంది.
BS-VI ప్రమాణాలు కలిగిన నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలు: మొదటి రిజిస్ట్రేషన్ నుంచి ఆరు సంవత్సరాల వరకు ఒకసారి, ఆరు నుంచి పది సంవత్సరాల మధ్య ప్రతి ఏడాదికి ఒకసారి, పదేళ్లు దాటిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి ధ్రువీకరణ పొందాలి.
BS-VI ప్రమాణాలు కలిగిన ట్రాన్స్పోర్ట్ వాహనాలు: వీటికీ మొదటి రిజిస్ట్రేషన్ తేదీ ఆధారంగా ఇదే విధమైన గడువులను నిర్ణయించారు. ఆరు సంవత్సరాల వరకు ఒకసారి, ఆరు నుంచి పది సంవత్సరాల మధ్య ఏడాదికి ఒకసారి, పదేళ్లు దాటిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి PUC సర్టిఫికెట్ పొందాలి.
పాత సర్టిఫికెట్లకు మినహాయింపు
కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే జారీ చేసిన PUC సర్టిఫికెట్ల విషయంలోనూ కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే ఉన్న సర్టిఫికెట్ల గడువు కొత్త నిబంధనల ప్రకారం వెంటనే మారదు. వాటి చెల్లుబాటు వ్యవధి కొత్త నిబంధనల ప్రకారం మారేది, ప్రస్తుతం ఉన్న సర్టిఫికెట్ జారీ అయిన తర్వాత తొలిసారి రెన్యూవల్ చేసుకున్నప్పుడే వర్తిస్తుంది. దీంతో వాహనదారులు తమ వాహనం కేటగిరీ, రిజిస్ట్రేషన్ తేదీ ఆధారంగా PUC సర్టిఫికెట్ గడువును గమనించాల్సి ఉంటుంది.