బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో మహిళ దారుణ హత్య
ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమా?
అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మల్లికార్జునపల్లికి చెందిన గొల్ల మాలక్క (40) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైంది. తలపై బండరాయితో మోది హత్య చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాలక్కకు సుమారు ఇరవై ఏళ్ల క్రితం యలగలవంక గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అనంతరం భార్యాభర్తలు శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి వలస వెళ్లి కొన్నేళ్లపాటు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించారు.
భర్తతో విభేదాలు రావడంతో సుమారు ఎనిమిదేళ్ల క్రితం మాలక్క యలగలవంక గ్రామానికి తిరిగి వచ్చి, తన సోదరి ఇంటి సమీపంలోని మరో ఇంటిలో నివసిస్తోంది. ఈ క్రమంలో తన సోదరి భర్త గొల్ల గోవిందుతో ఆమె సన్నిహితంగా మెలిగేది. కొద్ది రోజుల క్రితం మాలక్క, గోవిందు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మాలక్క హత్యకు గురైనట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గొల్ల గోవిందే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శివ తెలిపారు.