దిశ, నేషనల్ బ్యూరో : అండర్ వరల్డ్ డాన్, 1993 వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఒకప్పుడు నివసించిన, దక్షిణ ముంబైలోని ఒక శిథిలావస్థలో ఉన్న భవనం కూల్చివేతపై బాంబే హైకోర్టు గురువారం మధ్యంతర స్టే విధించింది. నవంబర్ 25 వరకు కూల్చివేత పనులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 87 ఏళ్ల నాటి ఈ పురాతన భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా (సీ-1 కేటగిరీ) మారడంతో, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతను ప్రారంభించారు. అయితే, దీనిని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. అది వక్ఫ్ ఆస్తి అని, ప్రస్తుతం చేపడుతున్న కూల్చివేత చర్య సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ అవసరమని పేర్కొంటూ తదుపరి విచారణ జరిగే నవంబర్ 25 వరకు స్టే కొనసాగించాలని ఆదేశించింది. 1939లో హజ్ యాత్రికుల కోసం నిర్మించిన ఈ భవనంలో 1986లో భారత్ విడిచి పారిపోయే వరకు దావూద్ కుటుంబం నివసించడంతో పాటు, తన నేర సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచే నడిపించాడు.
దావూద్ ఇబ్రహీం ఇంటి కూల్చివేతపై స్టే..- 25వ తేదీ వరకు కూల్చవద్దంటూ బాంబే కోర్టు ఆదేశం