దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాల్సిన గౌరవ వందనాన్ని పోలీసులు పొరపాటున ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఇచ్చారు. శనివారం ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లోని సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అక్కడికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా రానుండటంతో పోలీసులు ఆయనకు గౌరవ వందనం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే న్యాయమూర్తి కంటే ముందుగా ఒవైసీ అక్కడికి చేరుకోవడంతో ఆయన్నే జడ్జిగా భావించిన పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. పోలీసులు సెల్యూట్ చేయడంతో ఒవైసీ నిలబడి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గార్డ్ ఆఫ్ హానర్ అంటే ఏమిటి?
గార్డ్ ఆఫ్ హానర్ అనేది రాష్ట్ర అధికారిక గౌరవానికి, సార్వభౌమాధికారానికి ప్రతీకగా పరిగణిస్తారు. పోలీసు లేదా సాయుధ బలగాలకు చెందిన సిబ్బంది క్రమబద్ధంగా పరేడ్ నిర్వహించి, సెల్యూట్ చేయడం ద్వారా ఈ గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ఇది వ్యక్తిగత అభిమానం లేదా ప్రజాదరణ ఆధారంగా ఇచ్చే గౌరవం కాదు. నిర్దేశిత నిబంధనలు, ప్రోటోకాల్, రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారమే నిర్వహిస్తారు. రాష్ట్రం తరఫున ఒక వ్యక్తికి లేదా ప్రత్యేక సందర్భానికి అధికారికంగా గౌరవం ప్రకటించడం దీని ఉద్దేశం. ఎంపీలు, ఎమ్మెల్యేలకు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వరు.