దిశ, వెబ్‌డెస్క్: నల్లమందు (Opium) రవాణాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (CBN) అధికారులు సమర్థవంతంగా అడ్డుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కారు స్టెప్నీలో రహస్యంగా దాచి తరలిస్తున్న 16.43 కిలోల అక్రమ నల్లమందును స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
పక్కా నిఘాతో ఆపరేషన్..
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఝలావాడ్ జిల్లా నుంచి జైపూర్ (Jaipur)కు చెందిన మారుతీ సుజుకీ బ్రెజ్జా కారులో భారీగా నల్లమందు తరలిస్తున్నట్లుగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ రాజస్థాన్ యూనిట్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఇవాళ అధికారులు వెంటనే ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. అనుమానిత రహదారి మార్గంలో నిఘా ఏర్పాటు చేసి, వాహనాల కదలికలను నిశితంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే నేషనల్ హైవే 27పై కోటా బైపాస్ సమీపంలోని హ్యాంగింగ్ బ్రిడ్జ్ టోల్ ప్లాజా వద్ద ఆ బ్రెజ్జా కారును గుర్తించి అడ్డగించారు.
కారు సీజ్.. దర్యాప్తు ముమ్మరం
అనంతరం వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, స్టెప్నీలో దాచిన 16.43 కిలోల అక్రమ నల్లమందు లభ్యమైంది. దీంతో ఆ నల్లమందును స్వాధీనం చేసుకున్న అధికారులు, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. రవాణాకు వినియోగించిన మారుతీ సుజుకీ బ్రెజ్జా కారును కూడా సీజ్ చేశారు. ఈ నల్లమందు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి అప్పగించేందుకు తీసుకెళ్తున్నారు.. అనే కోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అధికారులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.