కుటుంబానికి మిత్రుల ఆర్థిక చేయూత
చిన్ననాటి స్నేహితుడి కుటుంబానికి రూ.81,500 అందజేత
తొర్రూరు, ఆంధ్రప్రభ : తమతో కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆవేదన చెందిన మిత్రులు ఆయన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు. స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్న మిత్రులంతా తలా కొంత మొత్తాన్ని సమకూర్చి రూ.81,500 అందజేశారు. తొర్రూరు పట్టణానికి చెందిన శివరాత్రి నాగవద్ది రాజు ఇటీవల పెద్ద వంగర మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనతో కలిసి 1997–98 విద్యా సంవత్సరంలో తొర్రూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకున్న స్నేహితులు ఈ ఆర్థిక సాయానికి ముందుకొచ్చారు.
ఈ మేరకు సమకూర్చిన రూ.81,500 మొత్తాన్ని గురువారం తొర్రూరు పట్టణంలోని మృతుడి నివాసంలో ఆయన భార్య హైమకు అందజేశారు. తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. చిన్ననాటి స్నేహితుడి కుటుంబానికి ఆపద సమయంలో ఆర్థిక సాయం అందించిన మిత్రుల సేవా నిరతిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.