దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొళత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) గురువారం నాడు గుండెపోటుతో మరణించారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 9న చెన్నైలోని అమింజికరైలో ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ సమయంలోనే గుండెపోటు రావడంతో మధ్యాహ్నం 2.24 గంటలకు తుదిశ్వాస విడిచారు. వీఎస్ బాబు డీఎంకేలో ఏరియా కార్యదర్శిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అదే పార్టీ నుంచి 2006లో మొదటి సారిగా పురసవాక్కం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011 తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2016లో అన్నాడీఎంకేలో చేరారు. ఈ ఏడాది ప్రారంభంలో టీవీకేలో చేరి, స్టాలిన్‌పై విజయం సాధించారు. వీఎస్ బాబు మృతి పట్ల తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సీఎం విజయ్ సంతాపం వ్యక్తం చేశారు. ఎంకే స్టాలిన్ కూడా ‘ఎక్స్’ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.