చీరాల బీచ్‌కు వెళ్తుండగా బోల్తాపడిన ఇన్నోవా కారు
కుంకలమర్రు ఫ్లైఓవర్ వద్ద డివైడర్‌ను ఢీకొన్న వాహనం..
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
చిలకలూరిపేట, చీరాల, ఆంధ్రప్రభ : చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి చీరాల బీచ్‌కు బయలుదేరిన ఏడుగురు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. కుంకలమర్రు ఫ్లైఓవర్ వద్ద కారు అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. మృతులంతా చిలకలూరిపేట పట్టణానికి చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి 108 అంబులెన్స్ ద్వారా చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.