దిశ, వెబ్ డెస్క్: ఇటీవలే తీరం దాటిన ‘అక్వాన్’ (Akvan) తుఫాను బలహీనపడి అంతర్గత ఒడిశా మీదుగా అల్పపీడనంగా మారింది. అనంతరం బంగాళాఖాతంలో మరో వాతావరణ మార్పు చోటుచేసుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. నవంబర్ చివరి నాటికి అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా మరో ఉపరితల ఆవర్తనం (Cyclonic circulation) ఏర్పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. ఐఎండీ విడుదల చేసిన తాజా రెండు వారాల అంచనా నివేదికలో ఈ కొత్త ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశమున్నట్లు సూచించింది. ఈ సంభావ్య వాతావరణ వ్యవస్థ కచ్చితమైన స్థానం, తీవ్రత, ప్రయాణించే దిశ (Trajectory) గురించి ఇప్పుడే ఎలాంటి నిర్దిష్ట అంచనాను విడుదల చేయలేదని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర (Mrutyunjay Mohapatra) తెలిపారు.
దీనిపై ఇప్పుడే పూర్తి వివరాలు అంచనా వేయడం తొందరపాటు అవుతుందని, ప్రజలు వాతావరణ శాఖ విడుదల చేసే తదుపరి బులెటిన్లను నిశితంగా గమనిస్తూ ఉండాలని ఆయన సూచించారు. సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య బంగాళాఖాతంలో నాలుగు నుంచి ఐదు తుఫాన్లు ఏర్పడతాయని, ఈ ఏడాది ఇప్పటికే మూడు తుఫాన్లు ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలను తాకాయని మహాపాత్ర గుర్తుచేశారు. ఈ ఏడాది కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులు 1987 నాటి బలమైన ‘ఎల్ నినో’ (El Niño) సంవత్సరంతో చాలా వరకు పోలి ఉన్నాయని, వరుస తుఫాన్లకు ఎల్ నినో ప్రభావం కూడా ఒక కారణం కావచ్చని ఆయన వివరించారు. వరుస తుఫాన్లతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన తీర ప్రాంత ప్రజల్లో ఈ తాజా హెచ్చరిక మరింత ఆందోళన కలిగిస్తోంది.