దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ వెబ్ (WhatsApp Web) వినియోగదారులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది. పబ్లిక్ కంప్యూటర్లు, షేర్డ్ డివైజ్‌లలో వాట్సాప్ వెబ్ లాగిన్ చేసి వదిలేస్తే, సైబర్ నేరగాళ్లు ఖాతాలను హైజాక్ చేసి, వ్యక్తిగత చాట్స్ చదివి, మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పరిధిలోని నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) జారీ చేసిన సూచనల ప్రకారం.. లాగిన్ అయి ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్ల ద్వారా అక్రమంగా ప్రవేశించే (ఇల్లీగల్ ఎంట్రీ) అవకాశం ఉంది. దీంతో దుండగులు మెసేజ్‌లు చదవడం, ఖాతాదారుడి పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపడం, కాంటాక్ట్‌లు, గ్రూప్ డిస్కషన్లు యాక్సెస్ చేయడం, అలాగే ఫిషింగ్, మోసాలు, సోషల్ ఇంజనీరింగ్ దాడుల కోసం వారి గుర్తింపును దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది.
మాన్యువల్‌గా లాగ్ అవుట్ తప్పనిసరి..
వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయిన తర్వాత పని పూర్తవగానే తప్పనిసరిగా మాన్యువల్‌గా లాగ్ అవుట్ చేస్తేనే సురక్షితంగా ఉండొచ్చని సైబర్ నేర నిరోధక విభాగం తెలిపింది. కేవలం బ్రౌజర్ విండో లేదా ట్యాబ్‌ను మూసివేయడం వల్ల లాగ్ అవుట్ అయినట్లు కాదని, ఎక్కువసేపు లాగిన్‌లోనే ఉంచకూడదని స్పష్టం చేసింది. ఆఫీస్ కంప్యూటర్లు, షేర్డ్ సిస్టమ్స్, ఇతరులు యాక్సెస్ చేయగలిగే పరికరాల్లో దీనిని వాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ, సంస్థాగత, ఆర్థిక, రహస్య, ఇతర సున్నితమైన సమాచారాన్ని కంప్యూటర్లలోని ‘వాట్సాప్ వెబ్’ ద్వారా పంపకపోవడం ఉత్తమం.
ఇన్‌కాగ్నిటో మోడ్ బెటర్..
ముఖ్యంగా సైబర్ కేఫ్‌లు, పబ్లిక్ కియోస్క్‌లు, హోటల్ బిజినెస్ సెంటర్లు, ఇతరుల నుంచి తీసుకున్న కంప్యూటర్లు, నమ్మకం లేని సిస్టమ్‌లలో వాట్సాప్ వెబ్‌కు లాగిన్ కాకపోవడం మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వాడటం అనివార్యమైతే ఇన్‌కాగ్నిటో (Incognito) లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌ను ఉపయోగించి, బ్రౌజర్ మూసే ముందు తప్పనిసరిగా లాగ్ అవుట్ చేయాలి. అదేవిధంగా, వాట్సాప్ వెబ్ వినియోగించే సమయంలో మన అకౌంట్ నుంచి అనుకోని మెసేజ్‌లు వెళ్లడం, కాంటాక్ట్‌ల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడం వంటివి గమనిస్తే వెంటనే అప్రమత్తమై లాగ్ అవుట్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. డివైజ్‌లు, ఆపరేటింగ్ సిస్టమ్స్, బ్రౌజర్లు, సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవాలి. అనుమానాస్పద డౌన్లోడ్స్, తెలియని ఫైళ్లు, క్రాక్డ్ సాఫ్ట్వేర్లు, నమ్మకం లేని యాప్‌లకు దూరంగా ఉండాలని కేంద్ర సైబర్ నేర నిరోధక విభాగం కీలక అడ్వైజరీ జారీ చేసింది.